తనకంటూ ఓ స్పెషల్ జోనర్, ఇమేజ్ సెట్ చేసుకున్న హీరో అల్లరి నరేష్. కామెడీ హీరోగా తన అల్లరితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు. 2002లో వచ్చిన అల్లరి సినిమాతో కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ దాదాపు 18ఏళ్ల కెరీర్ లో 50కి పైగా చిత్రాలలో నటించారు. ఐతే కొన్నాళ్లుగా అల్లరి నరేష్ తెరపై నవ్వులు పంచడంలో విఫలం చెందుతున్నాడు. ఆయన ఈ మధ్య చేసిన అరడజను సినిమాలు పరాజయం పొందాయి. దీనితో ఆయన పంథా మార్చినట్టు తెలుస్తుంది. ఆయన తదుపరి చిత్రం నాంది సీరియస్ కంటెంట్ తో తెరకెక్కుతుంది.
ఈ మూవీ ఫస్ట్ లుక్ కొద్దిరోజుల క్రితం విడుదల కాగా, బట్టలు లేకుండా గాయాలతో వేలాడ దీసినట్లున్న నరేష్ లుక్ సినిమాపై ఆసక్తిని రేపింది. కాగా గత ఏడాది విడుదలైన మహర్షి సినిమాలో అల్లరి నరేష్ ప్రాధాన్యం ఉన్న మహేష్ మిత్రుడు పాత్ర చేశారు. నమ్మిన దాని కోసం, తన ఊరి పొలాలను కాపాడుకోవడం కోసం ఒంటరి పోరాటం చేసే వ్యక్తిగా నరేష్ నటన సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐతే ఈ మూవీ షూటింగ్ సమయంలో మహేష్ తనకు మధ్య ఎలాంటి రేలషన్ ఉండేదో ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు.
సెట్స్ లో మహేష్ నరేష్ ని సర్ అని పిలిచేవాడట. మహేష్ అంతటి స్టార్ తనని అలా పిలుస్తుంటే నరేష్ కి కొంచెం ఇబ్బందిగా ఉండేదట. అలా పిలవకండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని నరేష్ మహేష్ తో కూడా చెప్పారట. అయినప్పటికీ మహేష్ అలానే పిలిచేవారట. సెట్ లో మహేష్ అందరినీ ఒకే దృష్టితో చూస్తారు, ఆయన రియల్ సూపర్ స్టార్ అని నరేష్ మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తారు.