‘పుష్ప’ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు అనే ప్రశ్న వేయడం అవివేకం అవుతుంది అనొచ్చు. ఎందుకంటే సినిమా బ్యాక్‌డ్రాప్, సినిమా కథ.. అది నడిచే కాలం గురించి తెలిస్తే చాలు.. ఆ కష్టం గురించి చెప్పడానికి. అయితే ఆ కష్టాల గురించి తెలుసుకోవడం ఆసక్తికరమే. ఎందుకంటే ఏదో సెట్‌లో అడవి సెటప్ వేసి సినిమా పూర్తిగా చుట్టేయలేదు. మారేడుమిల్లి అడవుల్లోకి వెళ్లి సినిమా చిత్రీకరించారు. దీని గురించి బన్నీ ఇటీవల చెప్పుకొచ్చాడు.
‘పుష్ప’ సినిమాకు సంబంధించి మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించడమే పెద్ద సవాలు అంటున్నాడు బన్నీ. మన పక్కనే అంత మంచి అడవి… అంతటి అద్భుతమై లొకేషన్ ఉందని ఇన్నాళ్లూ తెలుసుకోలేకపోయాం అని అన్నాడు అల్లు అర్జున్. అడవిలో ఒకట్రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లి చిత్రీకరణ చేశారట. పెద్దగా ఎవరూ వెళ్లని, రహదారులే లేని ప్రాంతాలకు వెళ్లి మరీ షూట్ చేశారట. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయట. సినిమా బృందమంతా వెళ్లడానికి ప్రత్యేకంగా అక్కడ రోడ్డు వేశారట.
అయితే వర్షాలు పడి మొత్తం కొట్టుకుపోయేదట. దీంతో రోజూ 400 వాహనాల్లో ఆ రోడ్డుమీదుగా వెళ్లి, చిత్రీకరణ చేసుకుని వచ్చేవారట. ఈ ప్రయాణం మొత్తం టీమ్‌కి పెద్ద సవాలు అని చెప్పాడు బన్నీ. అయితే ఇదో అందమైన అనుభవం కూడా అని అంటున్నారు. చిత్రీకరణ జరిగినన్ని రోజులూ… అడవిని పరిశుభ్రంగా ఉంచారట. ఈ విషయమే మొన్న మేకింగ్ వీడియోలో కూడా విన్నాం. ఈ అడవి ప్రాంతాన్ని మనం పాడు చేయకపోతే చాలు అనేవారట టీమ్.