ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పుష్ప పార్ట్1 రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఏపీలో టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేయడంతో పుష్ప సినిమాకు పాత టికెట్ రేట్లు అమలులో ఉండనున్నాయి. పుష్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైకు వెళ్లిన బన్నీ అక్కడ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. అల వైకుంఠపురములో పూర్తైన తర్వాత పుష్పను మొదలుపెట్టానని 45 రోజుల్లో పుష్పరాజ్ గా మారానని బన్నీ అన్నారు.
పుష్పరాజ్ పాత్ర కొరకు కష్టపడ్డానని ఈ పాత్ర కొరకు మేకప్ వేయడానికే 2 గంటల సమయం పట్టిందని బన్నీ చెప్పుకొచ్చారు. సినిమాలో ఫహద్ ఫాజిల్ నటన అద్భుతమని ఆయన అభినయానికి తాను ఫిదా అయ్యానని బన్నీ తెలిపారు. మలయాళ భాష ప్రచారంలో ఫహద్ ఫాజిల్ గురించి మరిన్ని విషయాలను చెబుతానని బన్నీ వెల్లడించారు. రష్మిక పాత్ర చాలామందిపై ప్రభావం చూపిస్తుందని బన్నీ తెలిపారు. పుష్ప మూవీ ప్రేక్షకులను నచ్చుతుందని ఆశిస్తున్నానని బన్నీ పేర్కొన్నారు.
తన సినిమాలు హిందీలోకి డబ్ కావడంతో హిందీ ఫ్యాన్స్ కు దగ్గరయ్యానని అయితే తనకు మాత్రం తమిళనాడులో గెలవాలని ఉందని బన్నీ వెల్లడించారు. తాను పుట్టింది మద్రాస్ లో అని తాను తమిళుడినే అని బన్నీ కామెంట్లు చేశారు. 20 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు తాను ఇక్కడే ఉన్నానని బన్నీ అన్నారు. తమిళంలో స్పష్టంగా మాట్లాడి బన్నీ అక్కడి ప్రేక్షకులను, మీడియాను ఆశ్చర్యపోయేలా చేశారు. పుట్టి పెరిగిన తమిళనాడులో పుష్ప బాగా ఆడాలని తన కోరిక అని బన్నీ చెప్పుకొచ్చారు.
లైకా వాళ్లు పెద్ద సంఖ్యలో థియేటర్లలో పుష్ప మూవీని రిలీజ్ చేస్తున్నారని బన్నీ చెప్పుకొచ్చారు. నాలుగు సినిమాలకు పడే కష్టం పుష్ప సినిమాకు పడ్డానని బన్నీ తెలిపారు.మరి బన్నీ కష్టానికి తగిన ఫలితం ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. బన్నీకి జోడీగా ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో నటిస్తుండగా సామ్ ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేశారు.