ఆరు నెలలు సావాసం చేస్తే వారువీరు అవుతారంటారు. మరి త్రివిక్రమ్ తో మూడు సినిమాల ప్రయాణం అల్లు అర్జున్ లోనూ భారీ మార్పులు తీసుకొచ్చినట్లుంది. అందుకే.. ఈమధ్య ప్రతి ప్రశ్నకు సమాధానం కవితాత్మకంగా ఉంటుంది. ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ.. “వారసత్వం” గురించి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “మేం అందరం గుళ్ళో పూజారులం లాంటోళ్ళాం. గుళ్ళో దేవుడికి అర్చన చేయడం పూజారి పని.. థియేటర్ కి వచ్చిన ఆడియన్ ని మెప్పించడం మా పని. అందులో పెద్ద తేడా ఏమీ లేదు. ఒకవేళ పూజారులు వారసత్వం తీసుకొని దేవుడ్ని కొలవడం తప్పైతే.. అప్పుడు మేం వారసత్వంలో ప్రేక్షకుల్ని మెప్పించడం కూడా తప్పే” అని చెప్పుకొచ్చాడు.
పోలిక కాస్త టిపికల్ గా ఉన్నా.. అల్లు అర్జున్ అన్న మాటల్లో నిజం లేకపోలేదు. వారసత్వం అనేది కేవలం వెండితెరకు పరిచయం అయ్యేవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ప్రేక్షకులు ఆదరించాలన్నా సినిమాలు ఆడాలన్నా కావాల్సింది టాలెంట్. అది లేకపోతే ఎంత గొప్ప వారసత్వం ఉన్నా వర్కవుట్ అవ్వదు.