ఇండస్ట్రీలో అవార్డుల మీద చాలా బ్యాడ్ టాక్ ఉంది. లాబీయింగ్ చేస్తే అవార్డులు వస్తాయని కొందరు, రాజకీయ పరిచయాలు ఉంటే అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి అని ఇంకొందరు భావిస్తుంటారు. పలుమార్లు ఈ విషయం ప్రూవ్ అయ్యింది కూడా. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ (Aamir Khan) పలుమార్లు తాను అవార్డ్ ఫంక్షన్స్ కి ఎందుకు వెళ్ళడం మానేశాడో వివరించే విధానంలోనే అవార్డ్ ఫంక్షన్స్ అనేవి ఎంత కామెడీ అయిపోయాయో అర్థమవుతుంది. తాజాగా ఈ అవార్డుల మీద స్పందించారు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad).
ఇన్నేళ్ల నట ప్రస్థానంలో ఆయనకి ఒక్క అవార్డ్ కూడా రాకపోవడం, ముఖ్యంగా ఆయన్ను ఇప్పటివరకు నంది పురస్కారం ఇప్పటిదాకా వరించకపోవడంపై ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా.. దానికి రాజేంద్రప్రసాద్ ఆయన స్టైల్లో వ్యంగ్యంగా వివరణ ఇచ్చారు. ఒకానొక సందర్భంలో రామోజీరావు (Ramoji Rao) గారు “నీకు పద్మశ్రీ ఉందా?” అని అడిగారు, లేదని చెబితే.. “పద్మశ్రీ కంటే నువ్ చాలా ఎక్కువ” అన్నారు. అదే నాకు పది పద్మశ్రీలు అంత గొప్ప. అందుకే పెద్దగా ఎప్పడు పద్మ అవార్డుల గురించి పట్టించుకోలేదు.
బాధ మాత్రం ఎప్పడు పడలేదు, ఒక పడితే మీడియాకి తెలిసిపోయేదిగా అంటూ రాజేంద్రప్రసాద్ ఇచ్చిన వివరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషించిన “షష్టిపూర్తి” ప్రెస్ మీట్ లో ఈ సందర్భం వచ్చింది. మరి రాజేంద్రప్రసాద్ కి పద్మ ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నకి సమాధానం ఎవరి దగ్గరా లేదు.
ఎందుకంటే.. ఒక నటుడిగా ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు, వందలాది క్యారెక్టర్లు మరెవరూ చేయలేదు. ఇన్నాళ్ల తర్వాత కూడా రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగగలుగుతున్నారు అంటే కారణం ఆయన నట పాఠవమే. మరి ఇప్పటికైనా తెలుగు చిత్రసీమ లేదా ప్రభుత్వం ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆయన్ను పద్మ పురస్కారంతో గౌరవిస్తుందో లేదో చూడాలి.