డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే బాగా ధనవంతులు చేసుకునే పెళ్లి అనుకుంటారు. ఒక విధంగా ఈ పాయింట్ కరెక్ట్ కావొచ్చు. ఎందుకంటే అంతమంది బంధువులను వేరే ప్రదేశానికి తీసుకెళ్లి వసతి కల్పించి పెళ్లి చేసుకోవడం పెద్ద విషయమే. అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదే ప్రైవసీ. సెలబ్రిటీలు అందుకే ఇలాంటి వెడ్డింగ్‌కి ఇష్టపడతారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఇలాంటి వివాహాలు చేసుకోవడం ఎక్కువైంది. ఇప్పుడు నిహారిక – చైతన్య పెళ్లి విషయంలో ఇలానే ఆలోచించారా… దీనికి సమాధానం కావాలంటే నాగబాబు విడుదల చేసిన వీడియో చూడాలి, లేదంటే ఈ వార్త చదవాలి.
నిహారిక-చైతన్యల వివాహం ఐదురోజులపాటు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగవైభవంగా జరిగింది. కొద్దిమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో జరిగిన ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు అంతర్జాలంలో సందడి చేస్తున్నాయి. కొన్ని నాగబాబు కూడా విడుదల చేస్తూ వచ్చారు. తాజాగా మూడో వీడియో కూడా ఆయన విడుదల చేశారు. అందులో సంగీత్ సంబరాలు ఉన్నాయి. నిహారిక-చైతన్య, నాగబాబు దంపతులు, రామ్‌చరణ్, బన్నీ వేసిన డ్యాన్స్‌తో వీడియో సూపర్ ఉంది. ఈ వీడియోలోనే డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ పెళ్లి చేయడానికి కారణాన్ని కూడా చెప్పారాయన.
‘‘నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ స్టైల్‌లో పెళ్లి చేయడానికి కారణాలున్నాయి. కరోనా పరిస్థితులతో తక్కువమందితో వేడుకలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. ఆ కారణంతో కుటుంబసభ్యులు, కొంతమంది స్నేహితులతో డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నాం. ఇది పక్కనపెడితే బన్నీ, చరణ్ వివాహాల్లో… వచ్చే వారిని రిసీవ్ చేసుకోవడం, ఏర్పాట్లు చూసుకోవడంలోనే మేం ఉండిపోవాల్సి వచ్చింది. అసలు ఎంజాయ్ చేసే అవకాశమే రాలేదు. అందుకే నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే బాగుంటుందనుకున్నాం’’ అని చెప్పారు నాగబాబు.
‘‘త్వరలో సన్నిహితుల్ని, హితుల్ని పిలిచి రిసెప్షన్ ఇస్తాం. చైతన్య-నిహారిక ఇష్ట ప్రకారమే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాం. ఉయద్‌విలాస్‌లో ఏర్పాట్లకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని వరుణ్‌తేజ్ చేశాడు’’ అని నాగబాబు తెలిపారు. అంటే హైదరాబాద్‌లో మరోసారి నిశ్చయ్ సంబరాలు ఉండబోతున్నాయన్నమాట. ఈసారి ఎవరెవర్ని పిలుస్తారో చూడాలి.