విక్టరీ వెంకటేష్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. మూడున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా.. సెంటిమెంట్ ను అద్భుతంగా పండించే వ్యక్తిగా వెంకటేష్ కు పేరుంది. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం దర్శక నిర్మాతలకు అప్పుడూ ఇప్పుడు ఉంది. ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటివరకు ఒక్క వివాదం కానీ,
మచ్చ కానీ లేని అరుదైన వ్యక్తుల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. సినీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా వెంకటేష్ అందరికీ సుపరిచితుడే. కానీ ఆయన సతీమణి, పిల్లలు అంతగా బయట కనిపించరు. వారి గురించి తెలుసుకోవాలని .. ప్రేక్షకులు ప్రయత్నిస్తూనే ఉంటారు. మీ కోసమే ఈ స్టోరీ.
వెంకటేష్ భార్య పేరు నీరజారెడ్డి. వీరిది చిత్తూరు జిల్లా మదనపల్లె. తల్లిదండ్రులు గంగవరపు వెంకట సుబ్బారెడ్డి, ఉషారాణి. వీరిది పెద్ద జమీందారి కుటుంబం. వందలాది ఎకరాల భూమితో పాటు ఎన్నో వ్యాపారాలు కూడా వున్నాయి.
అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోగా వెంకటేష్ నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయనకు పెళ్లి చేయాలని రామానాయుడు నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే మంచి సంబంధం ఉంటే చెప్పాలని విజయ అధినేత నాగిరెడ్డికి చెప్పారట. దీంతో నీరజారెడ్డి కుటుంబం గురించి నాగిరెడ్డి .. రామానాయుడికి చెప్పారట.
నాగిరెడ్డి సూచన మేరకు ముందుగా రామానాయుడు మదనపల్లి వెళ్లి తొలుత నీరజారెడ్డిని చూసి వచ్చారు. ఆయనకు వారి కుటుంబం, అమ్మాయి కూడా బాగా నచ్చడంతో వెంకటేష్ ను పిలిపించి చూపించారు. ఇద్దరికి ఒకరినొకరు నచ్చడంతో 1989లో వెంకటేష్ , నీరజారెడ్డి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
నిజానికి వెంకటేష్ ది కులాంతర వివాహం కాదు. నీరజ పేరు చివర రెడ్డి అని వున్నప్పటికీ ఆమెది రెడ్డి సామాజిక వర్గం కాదు. వాళ్లది కమ్మ సామాజిక వర్గమే. రాయలసీమలోని మదనపల్లె పరిసర ప్రాంతంలోని ప్రజలు ఏ కులానికి చెందిన వారైనా సరే పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం సర్వసాధారణమట. ఆ ఊరి కొండపై ‘రెడ్డమ్మ’ అనే దేవత కొలువై ఉండటం తో అక్కడి వారంతా పేరు చివరన రెడ్డి అని తగిలించుకుంటారట.
నీరజారెడ్డి అమ్మమ్మ గారిది కృష్ణా జిల్లా కైకలూరు దగ్గర ఉన్న వరహా పట్నం. వీరిది కూడా సంపన్న కుటుంబమే. చదువుకున్న రోజుల్లో సెలవుల సమయంలో వారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి గడిపేదట.
నీరజారెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం మదనపల్లిలోని సీఎస్ఐ గర్ల్ స్కూల్ లో జరిగింది. అక్కడ పదవ తరగతి వరకు చదువుకున్న ఆమె.. అనంతరం మదనపల్లిలోని వీటీ కాలేజీలో చదువుకున్నారు. ఆపై ఎంబీఏ పూర్తి చేశారు.
ఇక.. నీరజ మేనమామ, బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావు. ఆయన 2014లో బీజేపీ తరపున కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ ఎన్నికల సమయంలో నీరజారెడ్డి తన మామయ్య తరపున ప్రచారం కూడా పనిచేశారట.
వెంకటేష్ – నీరజారెడ్డి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆశ్రిత రెడ్డి, హయ వాహిని, భావన, అర్జున్. వీరిని మీడియాకు , సినీ ప్రపంచానికి దూరంగా ఉంచుతున్నారు వెంకటేష్.