యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంధుడిగా నటించబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతకంటే ముందే రామ్ గుడ్డివాడిగా నటిస్తున్నట్లు న్యూస్ విహారం చేసింది. చివరికి ఆ పాత్రలో రవితేజ నటించడం, రాజా ది గ్రేట్ రిలీజ్ కావడం జరిగిపోయింది. అయితే రామ్, ఎన్టీఆర్ చేయాలనుకున్న కథలేంటి? .. ఇదే కథ.. లేకుంటే వేరే కథ? అని అందరినీ వేధిస్తోంది. ఈ సందేహాలపై దర్శకుడు అనిల్ రావిపూడి నేడు క్లారిటీ ఇచ్చారు. “ఈ కథ రాసుకున్నప్పుడు మొదట రామ్ కు వినిపించాను. తర్వాత ఎన్టీఆర్ దగ్గరకు కూడా వెళ్లాను. రామ్ కు చెప్పిన కథనే ఎన్టీఆర్ కు కూడా చెప్పాను.
కానీ రవితేజతో ఇప్పుడు చేసిన రాజా ది గ్రేట్ సినిమా మాత్రం రామ్, ఎన్టీఆర్ కు చెప్పిన కథ కంటే ఇంకా మెరుగైంది. స్టోరీ లైన్ అదే అయినప్పటికీ టోటల్ గా కథను మార్చేశాను” అని వివరించారు. రాజా ది గ్రేట్ ఓ హాలీవుడ్ మూవీకి రీమేక్ అనే రూమర్ పై మాట్లాడుతూ… “ఇది ఏ మూవీకి రీమేక్ కాదు. బ్లయిండ్ ఫ్యూరీ, యోధ, కనుపాప లాంటి సినిమాలు చూసి, వాటి స్పూర్తితో ఈ స్టోరీ రాసుకున్నాను” అని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.