‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవన్ కల్యాణ్ ఈ టర్మ్‌లో ఆఖరి సినిమా అనుకున్నారంతా. ఎందుకంటే ‘ఓజీ’ వచ్చేసింది.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆయన పార్ట్ షూటింగ్ అయిపోయింది. ఇంకా ఆయన నుండి కొత్త సినిమా ప్రకటన ఏదీ రాలేదు. కాబట్టి ఇదే ఆఖరు అని అనుకున్నారు. కానీ ‘ఓజీ’ సినిమా సక్సెస్ మీట్‌లో సినిమాలు చేయడానికి నేను రెడీ అని చెప్పేశారు. అయినప్పటికీ ఇంకా ఏ సినిమా కూడా ఓకే అవ్వలేదు. అయితే ఇప్పుడు ఇద్దరు, ముగ్గురు నిర్మాతల పేర్లు చర్చకు వచ్చాయి. అందులో ఓ నిర్మాత పేరు, అతని దగ్గరున్న ఆప్షన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్‌లోనే పవన్ కల్యాణ్ మరోసారి నటిస్తారు అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒకటి, రెండు సందర్భాల్లో పవన్ కోసం కథ రెడీ చేయించే పనిలో దిల్ రాజు ఉన్నారని కూడా పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు దిల్ రాజు ఈ విషయంలో సీరియస్ ప్రయత్నాలు జరుగుతున్నాయట. చిరంజీవితో ‘మన శంకర్‌వరప్రాద్ గారు’ సినిమా చేస్తున్న అనిల్ రావిపూడితో ఈ మేరకు మంతనాలు జరుగుతున్నాయట. దిల్ రాజు బ్యానర్‌లో ఆయన ఓ సినిమా చేయాల్సి ఉందట. ఈ ప్రాజెక్ట్ గురించి గత కొన్ని నెలలుగా చర్చలు సాగుతున్నాయట.
పవన్ కల్యాణ్‌కు తగ్గట్టు, ఆయన అభిమానులకు నచ్చేటట్లు ఓ సినిమా చేస్తే పక్కా విజయం అందుకోవచ్చు అని దిల్ రాజు అనుకుంటున్నారట. చిరంజీవిలోని మునపటి కామెడీ టైమింగ్‌ను ‘మన శంకర్‌వరప్రసాద్ గారు’లో అనిల్ బయటకు తీశారని టాక్. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో కూడా అదే చేస్తే విజయం సునాయాసం అనేది ఇండస్ట్రీ టాక్. ఒకవేళ అదే జరిగితే పవన్ కల్యాణ్‌తో ‘తమ్ముడు’ లాంటి సినిమాను అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమాను అనిల్ రావిపూడి అంకుల్ పీఏ అరుణ్ ప్రసాదే తెరకెక్కించారు.