టాలీవుడ్‌లో 100% హిట్ ట్రాక్ కొనసాగిస్తూ, ప్రేక్షకులను నవ్విస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). క్లీన్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలను అద్భుతంగా మలచడంలో దిట్ట అని నిరూపించాడు. లేటెస్ట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam) కూడా అదే ఫార్ములాతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా మరోసారి అనిల్ మాస్ మార్కెట్‌ను నిరూపించింది. ఇప్పుడీ విజయంతో మెగాస్టార్ చిరంజీవి తో (Chiranjeevi) కొత్త ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నాడు అనిల్ రావిపూడి.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై స్క్రిప్ట్ పనులు పూర్తవ్వగా, పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తో (Jr NTR) సినిమా చేసే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకు అనిల్ రావిపూడి ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. అనిల్ మాట్లాడుతూ – “ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. వరల్డ్ వైడ్ లెవెల్‌లో స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన్ను గ్లోబల్ రేంజ్ మాస్ లెవెల్‌లో చూపించడానికి నా కథలు ఇప్పుడంత సరిపోవని నాకనిపిస్తోంది.
నా స్టైల్‌లో నేను కంఫర్ట్‌గా ఉన్నా, కానీ ఎన్టీఆర్ స్థాయికి తగినట్టుగా కథను మరో లెవెల్‌కు తీసుకెళ్లాలి. యూనివర్సల్‌గా వర్కయ్యే పర్‌ఫెక్ట్ స్టోరీ రాస్తే తప్ప ఆ కాంబినేషన్ జరగదని నాకిప్పుడు తెలుసు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకు ముందు ఎన్టీఆర్ కాంబినేషన్‌పై కొన్ని చర్చలు జరిగాయని, కానీ కొన్ని కారణాల వల్ల వర్క్ అవుట్ కాలేదని వెల్లడించాడు. అయితే భవిష్యత్తులో, 2-3 ఏళ్లలో తనకు సరిపోయే పర్‌ఫెక్ట్ స్టోరీ వస్తే తప్పకుండా ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్టు స్పష్టంచేశాడు.
“నాకు అందరు హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. కానీ వాళ్లకు సరిపడే కథలు నా దగ్గర రావాలి. ఒకసారి అలాంటి స్టోరీ సిద్ధమైతే హడావుడి లేకుండా తగినప్పుడు ఎనౌన్స్ చేస్తా” అని చెప్పాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా ఫిక్స్ కాగా, ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ మీద ఫోకస్ పెడుతున్నట్టు వెల్లడించాడు అనిల్. త్వరలోనే ఈ కాంబినేషన్ పై క్లారిటీ రానుంది.