మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెల 10వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవికి ప్రధానంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య పోటీ ఉండనుంది. ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికైతే కచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మేలు చేస్తానని ప్రకాష్ రాజ్ చెబుతున్నారు.
ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించగా విష్ణు మాత్రం త్వరలో తన ప్యానెల్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవికి జీవిత పోటీ చేస్తుండగా ఇదే పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బండ్ల గణేష్ పోటీ చేస్తున్నారు. అయితే మంచు విష్ణు ప్యానల్ నుంచి ఈ పదవికి రఘుబాబు పోటీ చేస్తున్నారు. జనరల్ సెక్రటరీ పదవికి ఎవరు ఎంపికవుతారో చూడాల్సి ఉంది.
వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో కనీసం 500 మంది ఓటుహక్కును వినియోగించుకునే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో గెలవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మెగా కాంపౌండ్ ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చిందని వార్తలు వస్తున్నా చిరంజీవి మాత్రం ప్రత్యక్షంగా ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. నాగబాబు ప్రకాష్ రాజ్ కు మద్దతు ప్రకటించగా సీనియర్ నరేష్ విష్ణుకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.