వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న రాజ్ తరుణ్, తనకు ఆల్రెడీ “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు”తో డిజాస్టర్ ఇచ్చిన శ్రీనివాస్ తో రెండో ప్రయత్నంగా నటించిన చిత్రం “అనుభవించు రాజా”. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా అలరించింది. మరి సినిమా ఎలా ఉందో? రాజ్ తరుణ్ ఇప్పటికైనా హిట్ కొట్టగలిగాడో లేదో? చూద్దాం..!!
కథ: సొంతూరులో లక్షలు విలువ చేసే ఆస్తి, బోలెడు మంది స్నేహితులు ఉన్నప్పటికీ.. హైదరాబాద్ లో ఒక ఐటి కంపెనీలో సెక్యూరిటీగా జాబ్ చేస్తుంటాడు. అక్కడ వర్క్ చేసే శృతి (కషిష్ ఖాన్)ను ప్రేమిస్తాడు. అయితే.. రాజ్ సెక్యూరిటీ గార్డ్ అని తెలుసుకొని అతన్ని ఈసడించుకోవడానికి సరిగ్గా పది నిమిషాల ముందు మనోడి బ్యాగ్రౌండ్ తెలుసుకుని షాక్ అవుతుంది. అసలు రాజ్ ఎవరు? ఊర్లో ఆస్తి వదులుకొని వచ్చి సెక్యూరిటీ గార్డ్ గా ఎందుకు పని చేస్తున్నాడు? అందుకు కారణం ఏమిటి? ఊరి ప్రెసిడెంట్ తో ఉన్న గొడవేంటి వంటి ప్రశ్నలకు సమాధాన రూపమే “అనుభవించు రాజా” చిత్రం.
నటీనటుల పనితీరు: రాజ్ తరుణ్ కి ఈ తరహా పాత్రలు కొత్త కాదు. అతని రేంజ్ టైమింగ్ కి ఇది చాలా ఈజీ రోల్. అయితే.. రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్ పరంగానే కాక లుక్స్ పరంగానూ కాస్త నవ్యత పాటిస్తే మంచిది. లేదంటే కొన్నాళ్ల తర్వాత తన లుక్ చూసి ఏ సినిమాలోది అనే విషయాన్ని తానే గుర్తుపట్టలేడు. కషిష్ ఖాన్ తన అభినయ సామర్ధ్యాన్ని చక్కగా ప్రదర్శించింది. చక్కని హావభావాలతోపాటు లిప్ సింక్ కూడా బాగా మ్యాచ్ చేసింది. సరైన పాత్రలు ఎంచుకుంటే మంచి నటిగా ఎదిగేందుకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి అమ్మడికి. అజయ్ తనకు అలవాటై బోర్ కొట్టేసిన విలన్ పాత్రకు న్యాయం చేసాడు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించుకున్నారు. కమెడియన్స్ మాత్రం కామెడీ చేస్తున్నామనే భ్రమలో రోత పుట్టించారు.
సాంకేతికవర్గం పనితీరు: సింపుల్ కథలను ఎంచుకోవడం అనేది తప్పు కాదు, ఆ సింపుల్ కథను ఇంకా సింపుల్ గా ఎలాంటి ఆసక్తికరమైన అంశాలు లేకుండా తెరకెక్కించడమే పెద్ద తప్పు. తొలి చిత్రంతో చేసిన అదే తప్పును రెండో సినిమాకి కూడా కొనసాగించాడు శ్రీనివాస్ గవిరెడ్డి. ఫస్టాఫ్ తోలి 30 నిమిషాలు మినహా సినిమా మొత్తంలో ఆకట్టుకొనే అంశం ఒక్కటీ లేదు. కామెడీ కూడా ఆల్రెడీ కొన్ని వందల సినిమాల్లో చూసేసిందే. ప్రెసిడెంట్ పంచ్ లు, విలేజ్ కామెడీ గట్రా చూసి చూసి ప్రేక్షకులు ఎప్పుడో బోర్ అయిపోయారు.
అలాంటి 80ల కాలం నాటి కథను, కనీస స్థాయి నవ్యత లేకుండా 90ల కాలం మేకింగ్ తో ప్రేక్షకుల్ని ఏ విధంగా ఆకట్టుకుందామనుకున్నాడో అర్ధం కాలేదు. సినిమాటోగ్రఫీ & మ్యూజిక్ వరకు బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ చాలా చీప్ గా ఉన్నాయి. చాలా సన్నివేశాల్లో అది ఊరు కాదని, గోడకి రంగులేసి కవర్ చేస్తున్నారని అర్ధమైపోతుంటుంది. ఒక పల్లెటూరు సినిమాకి కావాల్సింది ఆ వాతావరణం, దాన్ని కూడా క్రియేట్ చేయకపోతే ఎలా అనేది ప్రొడక్షన్ టీమ్ ఆలోచించాల్సిన విషయం.
విశ్లేషణ: ఎంతటి సాదాసీదా సినిమాకైనా కావాల్సింది కనీస స్థాయి కథ, ఆకట్టుకొనే కథనం. ఆ రెండూ కొరవడిన చిత్రం “అనుభవించు రాజా”. అక్కడక్కడా వచ్చే జోకులు తప్పితే సినిమా మొత్తంలో ఆకట్టుకొనే అంశాలు పెద్దగా లేవనే చెప్పాలి. సో, రాజ్ తరుణ్ వీరాభిమానులు మాత్రం కాస్త ఓపిగ్గా చూడదగిన చిత్రమిది.