త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అఆ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. ఆ చిత్రంలో ఆమె చేసిన నాగ వల్లి పాత్రకు ఆమెనే డబ్బింగ్ చెప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ చిత్రంలో ఏకంగా మెయిన్ హీరోయిన్ సమంతనే డామినేట్ చేసే విధంగా పెర్ఫార్మ్ చేసిందనే ప్రశంసలు కూడా దక్కించుకుంది అనుపమ. ఆ వెంటనే ‘ప్రేమమ్’ చిత్రంతో మరో హిట్ ను అందుకుంది. అయితే అందులో కనిపించేది కాసేపే.. అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది. ఇక శర్వానంద్ కు జోడీగా నటించిన ‘శతమానం భవతి’ సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ అందుకుని తన క్రేజ్ ను డబుల్ చేసుకుంది. ఇక ఈమెకు తిరుగులేదు అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఆ తర్వాత ఆమెకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. అందులోనూ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘కృష్ణార్జున యుద్ధం’ ‘తేజ్ ఐ లవ్ యూ’ వంటి చిత్రాలు ప్లాప్ అవ్వడంతో ఈమెను పట్టించుకున్న వారే లేరు.
ఈమె ఎక్కువగా గ్లామర్ పాత్రలు చెయ్యదు … అందుకే ఈమెకు ఆఫర్లు రావడం లేదు అని ఓ కారణంగా చెప్పుకొచ్చారు. ఇదే టైంలో రామ్ తో ‘హలొ గురు ప్రేమ కోసమే’ , బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘రాక్షసుడు’ వంటి చిత్రాలు చేసి హిట్లందుకున్నా ఉపయోగం లేకపోయింది. దీంతో కన్నడ వైపు ఓ లుక్కేసింది. అక్కడ పర్వాలేదనిపించింది. మరో వైపు తమిళ, మలయాళం నుండీ కూడా ఈమెకు మంచి ఆఫర్లే వస్తున్నాయి.. కాబట్టి ఇంకా టాలీవుడ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పెయ్యాలని ఈమె డిసైడ్ అయ్యిందట. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఓ ట్యాలెంటెడ్ హీరోయిన్ ను టాలీవుడ్ కోల్పోయినట్టే అని చెప్పాలి..!