బాహుబలి సినిమాల తర్వాత అనుష్క చేస్తున్న ఏకైన చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆసక్తిని మరింత పెంచింది. ఈ వీడియోని చూసి అరుంధతి 2 అని కొంతమంది అంచనావేశారు. మరికొంతమంది హారర్ సినిమా అని భావించారు. అయితే ఇవేవీ నిజం కాదంట. ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో అనుష్క పొలిటీషియన్‌గా కనిపించబోతుందని టాక్. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో అనుష్క కనిపించలేదు. అంతేకాదు నేటి కాలానికి 500 ఏళ్ల క్రితం నాటి పరిస్థితిని జోడించి చూపించబోతున్నారని తెలిసింది. డ్యూయల్ రోల్లో అనుష్క మరోమారు అదరగొట్టనుందని అభిమానులు ఆనందపడుతున్నారు.
యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించిన ఈ మూవీ గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు తో పాటు తమిళం, హిందీలో ఒకే సారి రిలీజ్ కానున్న ఈ చిత్రంలో యువ నటుడు ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండగా, ఉన్ని ముకుందన్ కీలక రోల్ పోషించారు. భారీ విజువల్ ఎఫక్ట్స్ కలిగి ఉన్న ఈ సినిమా అరుంధతి, రుద్రమదేవి తరహాలో అనుష్కకు మంచి పేరు తెచ్చి పెడుతుందని చిత్ర బృందం భావిస్తోంది. అనుష్క పెర్ పార్మెన్స్ తో పాటు మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ ఆకట్టుకోనుంది. ఆర్ట్ రవీందర్ వేసిన సెట్స్ గ్రాండియర్ గా ఉంటాయి. తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశానికి బలాన్నివ్వనున్నాయి.