హీరోలతో సమానంగా అనుష్క అభిమానులను సంపాదించుకుంది. అరుంధతి, రుద్రమదేవి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా అనుష్క మంచి పేరు సంపాదించుకుంది. ఎంతటి కష్టతరమైన రోల్స్ అయినా స్వీటీ చేయగలదని గుర్తింపు తెచ్చుకుంది. భాగమతి సినిమాలో మళ్ళీ అలాంటి సాహసోపేతమైన పాత్ర చేసింది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క రెండు విభిన్నమైన ఛాయలున్న పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ట్రైలర్ ద్వారా ఆకట్టుకున్న ఈ చిత్రం మరో మూడు రోజుల్లో థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అనుష్క ఆసక్తికర విషయాలు చెప్పింది. చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ కంటే హీరోలకు ఎక్కువగా రెమ్యునరేషన్ ఇవ్వడంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.
‘ఏ వృత్తిలో అయినా పనిని బట్టి పారితోషికం ఉంటుంది. ఎక్కువగా సినిమా భారం మొత్తం హీరో ఒక్కడే మోస్తారు. అతని క్రేజ్ బట్టే ఓపెనింగ్స్ వస్తాయి. హిట్ అయినా ప్లాప్ అయినా మొదటి ఎఫెక్ట్ అయ్యేది హీరోనే. అందుకే వారు ఎక్కువగా రెమ్యునరేష్ అందుకోవడంలో తప్పు లేదు” అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. “రెమ్యునరేష్ హీరోలతో సమానంగా కావాలని అడిగే బదులు నటీమణుల కోసం ఉత్తమ కథలు రాసేలా.. శక్తిమంతమైన పాత్రల్లో చూపించాలనే స్ఫూర్తి దర్శకుల్లో కలిగించేలా కష్టపడడం మంచిది” అని సూచించింది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన భాగమతి జనవరి 26 న తెలుగు, తమిళ భాషలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.