తెలుగు సినిమాను గౌరవించుకోవడానికి 1964 నుంచి నంది అవార్డ్స్ (Nandi Awards) పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ఇచ్చేది. 2016 తర్వాత ఈ గౌరవాన్ని తెలుగు సినిమా పొందలేకపోయింది. రాష్ట్రం రెండు ముక్కలు అవ్వడం, అప్పటి పాలకులు వివిధ కారణాల వల్ల ఈ విషయాన్ని పక్కన పెట్టడం జరిగిపోయాయి. తెలంగాణలో సింహా అవార్డ్స్ పేరుతో పురస్కారాలు ఇస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పినా అయినా అవ్వలేదు. ఏపీ ప్రభుత్వం నంది పురస్కారాల్ని తిరిగి ప్రవేశ పెడుతుంది అని అప్పుడు అన్నారు. అయితే ఇవేవీ జరగలేదు. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు మళ్లీ నంది అవార్డ్స్ ముందుకొచ్చాయి కాబట్టి.
అవును మీరు చదివింది నిజమే. నంది పురస్కారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఆలోచనలు చేసింది. అతి త్వరలో నంది పురస్కాలకు సంబంధించి ప్రకటన ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. చాలాకాలంగా మూలన పడిపోయిన నంది అవార్డులను (Nandi Awards) పునరుద్ధరించి, అతి తర్వలోనే ప్రకటిస్తాం. త్వరలోనే సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్య నిర్మాతలు, దర్శకులు, నటీనటులతో సమావేశం ఏర్పాటు చేయనున్నాం అని కందుల దుర్గేశ్ తెలిపారు.
‘భైరవం’ (Bhairavam) సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన అందాలున్నాయి. ఇక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఇంకా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాల్సి ఉంది. దానికి సంబంధించి స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్, రీ రికార్డింగ్ థియేటర్లు ఏర్పాటు కోసం పాలసీ తెచ్చే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ తరహాలో విశాఖపట్నాన్ని సినిమాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల షూటింగ్‌లకు రమ్మని ఏపీ ప్రభుత్వం చాలా నెలలుగా చెబుతూనే ఉంది. ఈ క్రమంలో మంత్రి దుర్గేశ్ మరోసారి పిలుపునిచ్చారు. ఇప్పుడు అవార్డులు కూడా ఇస్తాం అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమలో ఏమన్నా మార్పు వస్తుందేమో చూడాలి. అన్నట్లు ఇవే అవార్డులను ‘గద్దర్ పురస్కారాలు’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రదానం చేయనున్న సంగతి తెలిసిందే.