సినిమా నటులకు సెంటిమెంట్లు ఎక్కువ అని అంటుంటారు. అంటే సినిమా ముహూర్తం నుండి రిలీజ్ డేట్ వరకు ఇలా అన్నింటి విషయంలో ముహూర్తాలు పెట్టుకుని వెళ్తుంటారు. కొందరైతే సెట్స్‌కి వెళ్లడానికి ముహూర్తం పెట్టుకుంటారు. అంతటి సెంటిమెంట్ ఉన్న నటుల అభిమానులకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి కదా. అలాంటి ఓ సెంటిమెంట్ ఇప్పుడు రామ్‌చరణ్ అభిమానులకు తీవ్రంగా కలవరపెడుతోంది. ఆయన లేకుండా సినిమా చేయొచ్చు కదా అంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకునే పరిస్థితి వచ్చింది.
రామ్‌చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు సానా కలయికలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిపి ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాయి. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా కథతో రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ నుండి మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తారనేది ఆ వార్తల సారాంశం.
అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాను తీర్చిదిద్దే క్రమంలో నిర్మాతలు, దర్శకుడు కలసి ఈ ఆలోచన చేశారు అంటున్నారు. దీని కోసం ఇప్పటికే రెహమన్‌ను సంప్రదించారు అని కూడా అంటున్నారు. అదే ఇప్పుడు చరణ్ అభిమానులను షాక్‌కి గురి చేస్తోంది. ఇంతమంది సంగీత దర్శకులు ఉండగా రెహమాన్ ఎందుకు అని అంటున్నారు. అంటే ఆయన సంగీతం మీద ఉన్న భయం కాదు.. ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమా ఫలితం మీద సెంటిమెంట్‌తో ఈ భయం.
టాలీవుడ్‌లో ఆయన ట్రాక్ రికార్డు బ్యాడ్‌గా ఉండటమే కారణం. కెరీర్ మొదట్లో వెంకటేష్‌తో ‘సూపర్ పోలీస్’ అనే సినిమా చేశారు రెహమాన్. ఆ సినిమా ఫలితం గురించి వెంకీ ఫ్యాన్స్ ఎక్కడా చర్చించరు అంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా డిజాస్టర్‌ను కొన్ని ఉన్నాయి. రీసెంట్‌గా అంటే పవన్ కళ్యాణ్ కోసం ‘పులి’కి పని చేశారు. ఆ సినిమా ఫలితం ఇంకా దారుణం అని చెప్పాలి. అలాంటి రెహమాన్ ఇప్పుడు చరణ్‌కు పాటలు ఇస్తే పరిస్థితి ఏంటి అనేది భయం.