కొత్త తరం తెలుగు సినిమాలో పయనీర్ అని చెప్పుకొదగ్గ సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’ ఒకటి. మాస్ హీరోను ఇలానే చూపించాలి, ప్రేమ కథ అంటే ఇలానే ఉండాలి అనే స్టీరియో టైప్ ఆలోచనల్ని, కథల్ని చెత్త బుట్టలో పడేసిందీ సినిమా. అలాంటి సినిమా విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరో డేర్ మూవ్ తీసుకోనున్నారు. అదేంటి ‘మరో’ డేర్ మూవ్ అంటున్నారా? ఇలాంటి సినిమా చేయడం, విజయం సాధించడమే డేర్. కాబట్టి ఇప్పటికి మరో డేర్ మూవ్.
విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ‘అర్జున్ రెడ్డి’కి త్వరలో ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ బోల్డ్ క్లాసిక్ మూవీ రేర్ మూమెంట్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మరోసారి ఆ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే ఆ సినిమాను యాజ్ ఇట్ ఈజ్ కాకుండా ‘డైరక్టర్ కట్’ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అంటే ఫైనల్ ఎడిట్ కాకుండా ముందు సిద్ధం చేసిన పెద్ద వెర్షన్‌ను ఇప్పుడు తీసుకొస్తారట. ఈ ఆగస్టు 25కి ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ అయ్యి ఐదేళ్లు అవుతుంది. ఆ రోజే ఈ వెర్షన్ రిలీజ్ చేస్తారట.
‘అర్జున్ రెడ్డి’ సినిమాను తోలుత 4 గంటల 20 నిమిషాల నిడివితో తీశారట సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత దాన్ని 3 గంటల 45 నిమిషాలకు కుదించారట. అయితే ఈ లెంగ్త్ చాలా ఎక్కువని భావించి చివరకు సుమారు మూడు గంటల రన్ టైంతో సినిమా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ మూడు గంటల 45 నిమిషాల సినిమాను విడుదల చేయాలని సందీప్ రెడ్డి నిర్ణయించుకున్నారట. త్వరలోనే దీని పూర్తి డీటెయిల్స్ ఇస్తారట.
నిజానికి ఈ ‘పెద్ద’ అర్జున్ రెడ్డిని యాజ్ ఇట్ ఈజ్ విడుదల చేసి ఉంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేదని సందీప్ అంటున్నారు. విజయ్ పాత్ర ఇంకా బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేదని ఆయన చెబుతున్నారు. లాస్ట్ ఎడిట్‌లో తీసేసిన సన్నివేశాల్లో అర్జున్ రెడ్డి కాలేజీలో అడుగు పెట్టడానికి ముందు జీవితాన్ని చూపిస్తారట. దాంతోపాటు అర్జున్ రెడ్డి బాల్యం, తన బైక్‌తో ఉన్న అనుబంధం.. ఇలా ఆసక్తికరమైన సన్నివేశాలే ఉండబోతున్నాయట. అయితే మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తారా? లేక ఓటీటీలోనా అనేది తెలియడం లేదు.