‘పటాస్, డీజే, లై, ఉన్నది ఒకటే జిందగీ, విన్నర్’ వంటి పలు చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఆశిష్ గాంధీ. రాంనగర్‌లో పుట్టిపెరిగిన ఇతను తొలిసారి హీరోగా నటించిన మూవీ ‘నాటకం’. కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 28న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆశిష్ గాంధీ తన సినీ ప్రయాణం గురించి వివరించారు. “మా నాన్న గాంధీ అప్పట్లో సినిమాల్లో అవకాశాల కోసం బాంబే వరకు వెళ్లారు. కానీ నటుడు కాలేకపోయారు. మా నాన్న కోరికను తీర్చాలనే లక్ష్యంతో నేనీప్రయత్నానికి పూనుకున్నాను. అందుకే షార్ట్ ఫిలిం లో నటించాను. నెగిటివ్ రోల్స్ చేసాను. ఇప్పుడు హీరోగా అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తున్నా” అని వెల్లడించారు.
ఇక నాటకం సినిమా గురించి మాట్లాడుతూ… ‘‘బాలకోటేశ్వరరావు, పార్వతి అనే జంట స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. కథానుగుణంగానే బోల్డ్‌గా, రియలిస్టిక్‌గా సినిమాను చిత్రీకరించాం. ప్రేమ, యాక్షన్, రొమాన్స్ హంగుల సమ్మిళితంగా దర్శకుడు కళ్యాణ్ సినిమాను తీర్చిదిద్దారు. ఏడేళ్లుగా సినిమాల్లో నిలదొక్కుకోవడానికి నేను పడుతున్న కష్టాలు చూసి నటుడిగా నాకో మంచి జీవితాన్ని ఇవ్వడానికే మా అన్నయ్య ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. సిటీలో పెరగడంతో పల్లెటూరి పాత్ర కోసం మూడు నెలల పాటు హోమ్‌వర్క్ చేశాను” అని వివరించారు. “ట్రైలర్ చూసి రంగస్థలం, ఆర్‌ఎక్స్ 100 సినిమాల మాదిరిగా ఉందని అంటున్నారు. ఆ సినిమాలకు దీనికి ఎటువంటి సంబంధం ఉండదు” అని ఆశిష్ గాంధీ స్పష్టం చేసారు.