ఈ మధ్య కాలంలో వరుసగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పాత సినిమాల ప్రింట్ లను 4K కి డిజిటలైజ్ చేసి స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకల సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’, ప్రభాస్ నటించిన ‘బిల్లా’ ‘వర్షం’ చిత్రాలను రీ రిలీజ్ చేసి అలాగే విడుదల చేశారు. ఇందులో ‘పోకిరి’, ‘జల్సా’ బాగా పెర్ఫార్మ్ చేశాయి. ‘వర్షం’ జస్ట్ ఓకే. ‘బిల్లా’ మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు.
బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం కూడా రీ రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ఓవర్సీస్ లో బాగా కలెక్ట్ చేసింది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయింది. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్- శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్ షా’ మూవీని నిర్మాత నట్టి కుమార్ రీ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్ళు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ మూవీని రీ రిలీజ్ చేయడం జరిగింది.
నవంబర్ 19న రీ రిలీజ్ అయిన ‘బాద్ షా’ మూవీకి మొదటి రోజు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కానీ రెండో రోజు కొత్త సినిమాలు అయిన ‘యశోద’ ‘మాసూద’ ‘గాలోడు’ వంటి చిత్రాలు డామినేట్ చేసేశాయి. అందులోనూ రీ రిలీజ్ అవుతున్నట్టు సరైన ప్రమోషన్ కూడా చేయకపోవం మైనస్ అయ్యింది. ఇక ఈ చిత్రం తొలి వీకెండ్ కు రూ.16 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది.
షేర్ పరంగా చూసుకుంటే రూ.9 లక్షలు ఉంటుంది అని ట్రేడ్ పండితుల సమాచారం. ఇక 2013 లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఫుల్ రన్లో ఈ మూవీ రూ.46 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసి ఆ టైంకి ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. బండ్ల గణేష్ ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం.