దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన వెండి తెర కళాఖండం బాహుబలి-బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా విజయ బావుటా ఎగరవేసింది. తర్వాత పార్ట్ కోసం బాహుబలి అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి- కంక్లూజన్’ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. ఈ మూవీ టీజర్ ని సినిమా రిలీజ్ కంటే నాలుగు నెలల ముందే విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. ఈ విషయాన్ని భళ్లాళదేవుడు దగ్గుపాటి రానా చెప్పారు. రీసెంట్ గా ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి-2 టీజర్ వచ్చే జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులను ఇది శుభవార్తే.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ‘బాహుబలి- కంక్లూజన్’ క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారు. కేవలం ఈ యుద్ధ సన్నివేశం కోసం నిర్మాతలు శోభు యార్ల గడ్డ, ప్రసాద్ దేవి నేని 30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ మరింత ఉన్నతంగా ఉండాలని దర్శకధీరుడు కష్టపడుతున్నారు. పోరాట సన్నివేశాల్లో ఈ సారి 5 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటుండడం విశేషం. ఇంతవరకు ఏ తెలుగు చిత్రాన్ని ఇంతమందితో షూట్ చెయ్యలేదు. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయనున్నారు.