ప్రపంచ సినీ అభిమానుల మనసుదోచుకున్న మూవీ బాహుబలి. ఈ సినిమాని చూసి బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అనేక మంది స్ఫూర్తి పొందారు. ఇందులో ఎటువంటి తప్పులేదు. కానీ యువ డైరక్టర్ శ్రీవాస్ మాత్రం బాహుబలిలోని ప్రధాన లైన్ ని ఆధారం తీసుకొని సాక్ష్యం సినిమాని మలిచారని సినీ విశ్లేషకులు మాత్రమే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా విమర్శిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన “సాక్ష్యం” నిన్న విడుదలై ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఓపెనింగ్ సీన్ చూడగానే బాహుబలి గుర్తుకువస్తుంది. ‘బాహుబలి’లో మహేంద్ర బాహుబలిని భల్లాలదేవ (రానా) నుంచి శివగామి రక్షించే సన్నివేశం గుర్తుందా? ఆ సన్నివేశమే గుర్తొస్తుంది. అయితే అందులో శిశువును రక్షించేది రమ్యకృష్ణ అయితే.. “సాక్ష్యం”లో మీనా.
వెన్నులో బాణాలు దిగినా పిల్లాడిని కాపాడాలని పరమేశ్వరుడిని వేడుకున్న రమ్యకృష్ణ మాదిరిగానే ఇందులో… వెన్నులో కత్తి దిగినా పిల్లాడిని కాపాడాలని ఈశ్వరుడిని మీనా వేడుకుంటుంది. సన్నివేశం రాయడంలోనూ, తీయడంలోనూ ఎటువంటి మార్పు కనిపించదు. ఇదేకాకుండా బాహుబలిలో తమన్నా ప్రేమ కోసం వచ్చిన హీరోకి తండ్రిని చంపిన వాళ్ల గురించి తెలుస్తుంది. ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇందులో పూజా హెగ్డే ప్రేమ కోసం వచ్చిన హీరో తండ్రిని చంపిన వాళ్లను పంచభూతాల సహాయంతో చంపుతాడు. కానీ, అతని తండ్రిని వాళ్లే చంపారని అతడికి తెలీదు. అంతే తేడా. దాన్ని కొత్తగా భావించి శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఆ విషయాన్ని కొత్తగా ఫీలవ్వలేదు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు మంచి అభిప్రాయం కలగడంలేదు.