 
                                                        2015లో విడుదలైన బాహుబలి: ది బిగినింగ్, 2017లో విడుదలైన బాహుబలి: ది కంక్లూజన్ సినిమాలను కలిపి “బాహుబలి: ది ఎపిక్”గా మొదటి భాగం విడుదలైన 10 ఏళ్ల సందర్భాన్ని పురస్కరించుకుని రీరిలీజ్ చేసారు బాహుబలి టీమ్. సాధారణంగా రీ-రిలీజ్ అంటే సేమ్ సినిమా చూస్తాం. కానీ.. “బాహుబలి: ది ఎపిక్”ను మాత్రం రెండు సినిమాలను కలపడంతోపాటు.. కొన్ని కొత్త సీన్స్ కూడా యాడ్ చేసారు. మరి ఈ రీవాచింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం..!!

నోట్: ఇది రివ్యూ కాదు.. థియేటరికల్ ఎక్స్ పీరియన్స్ మాత్రమే!
టైటిల్ కార్డ్స్ నుంచే ఇది ఆల్రెడీ చూసిన సినిమా మాత్రం కాదు.. అంతకు మించి అనే భావన కలుగుతుంది. బాహుబలి2 టైటిల్ టెంప్లేట్ ను ఈ సినిమా కోసం వాడారు. ఆ టైటిల్స్ కి కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి వేల్యూ కూడా యాడ్ చేసింది.
చిన్నపాటి స్క్రీన్ ప్లే మార్పులతో సినిమా ముందుకు సాగుతూ ఉండగా.. ఎక్కడైతే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు అనిపించిందో.. అక్కడ వాయిస్ ఓవర్ తో సదరు సన్నివేశాలన్నీ స్కిప్ చేశారు రాజమౌళి. శివుడు-అవంతిక లవ్ స్టోరీ మొత్తాన్ని రెండు లైన్ల వాయిస్ ఓవర్ తో చెప్పుకొచ్చేశాడు రాజమౌళి.
ఆ తర్వాత వచ్చే సన్నివేశాలకు సత్యరాజ్ పాత్రతో వాయిస్ ఓవర్ చెప్పించడం కారణంగా.. సినిమా చాలా వేగంగా వెళ్లిపోతుంటుంది.
యాక్షన్ బ్లాక్స్ మళ్లీ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడం ఖాయం.

ప్రభాస్ అభిమానులందరూ ఎంతగానో వెయిట్ చేసిన పంచభూతాలు ఎపిసోడ్ కంపోజ్ చేసిన విధానం బాగుంది. అలాగే.. చాలా చోట్ల యాడ్ చేసిన సీన్లు మహా అయితే 10 సెకండ్లు ఉంటాయి కానీ.. అదే కిక్ ఇస్తుంది.
సినిమా చూస్తున్నంతసేపు, ప్రభాస్ లుక్స్, అనుష్క స్క్రీన్ ప్రెజన్స్, రానా వాచకం, నాజర్ టైమింగ్.. ఇది పాత సినిమా అనే భావన కలిగించవు. చాలా కొత్తగా ఉంటుంది. అందుకు కారణం అన్నపూర్ణ సంస్థ చేసిన రీమాస్టరింగ్ కూడా అనొచ్చు. కలర్ గ్రేడింగ్ విషయంలో తీసుకున్న కేర్ హైలైట్ అయ్యింది.

అయితే.. ప్రభాస్ రాటుదేలిన బేర్ బాడీ చూసినప్పుడు, ఎంత అందంగా, ఫిట్ గా ఉండేవాడు ప్రభాస్ అనిపిస్తుంది. ఇప్పుడు లూజు బట్టల్లో ప్రభాస్ ను బయట ఈవెంట్స్ లో చూసినప్పుడల్లా, ఏదో తెలియని వెలితి.
అనుష్క ఎంట్రీ సీన్ నుండి, ఆమె కళ్ళల్లో కనిపించే నిక్కచ్చితనం చూస్తున్నంతసేపు.. ఆ “సైజ్ జీరో” అనే సినిమా చేయకుండా ఉండి ఉంటే, ఇప్పుడు హ్యాపీగా నయనతారలా స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసేది కదా అనుష్క అనిపించకమానదు.
రానా ఠీవి చూస్తే.. అతడి స్క్రీన్ ప్రెజన్స్ ను, వాచకాన్ని మళ్లీ ఎవరో సరిగా వినియోగించుకోలేదు కదా అనిపిస్తుంది.
ఇక నాజర్, సత్యరాజ్ పెర్ఫార్మెన్స్ ను ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం.

పదేళ్ల క్రితం బాహుబలి సినిమా చూసినప్పుడు ఉన్న భావన, ఇప్పుడు వచ్చిన అనుభవంలో చాలా మార్పులు వచ్చాయి. ఆడియన్స్ గా మనం చాలా డెవలప్ అయ్యాం, దాంతో టెక్నికాలిటీస్ ని అర్థం చేసుకోవడమే కాక.. వాటిని అప్రిషియేట్ చేయడం మొదలెట్టాం. ఆ కారణంగా సినిమాలోని ఎలిమెంట్స్ ను ఇంకాస్త ఎక్కువగా ఆస్వాదిస్తాం. అందువల్ల.. బాహుబలి:ది ఎపిక్ థియేటరికల్ ఎక్స్ పీరియన్స్ అనేది ఇంకాస్త స్పెషల్ గా మారింది.

సో ఓవరాల్ గా చెప్పొచ్చేదేమిటంటే.. ఏదో కొత్త సినిమా చూసిన భావన కోసమో, ఏవేవో కొత్త సన్నివేశాల కోసం మాత్రమే బాహుబలి: ది ఎపిక్ చూడాలి అనుకుంటే మీరు సంతృప్తి చెందలేరు. ఎప్పుడైతే.. ఈ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తారో అప్పుడు సంతుష్టులవుతారు.
ఫోకస్ పాయింట్: హైలైట్స్ ఆఫ్ బాహుబలి!
Banner: ఆర్కా మీడియా
Release Date: అక్టోబర్ 31, 2025
Hero: ప్రభాస్
Heroine: అనుష్క, తమన్నా
Other Crew: రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు
Director: ఎస్.ఎస్.రాజమౌళి
Music Director: ఎం.ఎం.కీరవాణి
Producer: శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని
Cinematography: కె.కె.సెంథిల్ కుమార్
Editor: ఎస్.ఎస్.రాజమౌళి – కోటగిరి వెంటకటేశ్వర్రావు – తమ్మిరాజు
