సినిమా టైటిల్స్ ఎక్కడి నుండో పుట్టవు. మాటలు, పాటలు, కామెంట్ల నుండే వస్తుంటాయి అంటారు. గతంలో చాలా సినిమాల పేర్లు ఇలానే వచ్చాయి కూడా. తాజాగా మరో సినిమా పేరు ఇలానే పుట్టింది. ఇక్కడ విషయం ఏంటంటే… ఆ మాట వాడిన వ్యక్తే ఆ పేరును సినిమా టైటిల్‌గా రిజిస్టర్ చేశారు. ఓ సినిమా రిలీజ్ తర్వాత ఆ నిర్మాత ఎక్కువగా వాడిన పదమే అది. ఆ సినిమా ఏంటో చెప్పేస్తే… ఆ పదం ఏంటో మీరే చెప్పేస్తారు కూడా.
ఈ సంవత్సరం భారీ విజయం అందుకున్న చిన్న సినిమాల్లో ‘బేబీ’ ఒకటి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్‌కేఎన్ నిర్మించారు. ఆ సినిమా ఓ మోస్తరు అంచనాలతో వచ్చినా… సోషల్ మీడియా ప్రచారం, యూత్ మౌత్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ అయిపోయింది. ఈ క్రమంలో నిర్మాత (SKN) ఎస్‌కేఎన్ ప్రచార కార్యక్రమాల్లో ఈ సినిమా ‘కల్ట్ బొమ్మ’ అనేవారు.
ఈ పదం విషయంలో జోకులు పేలినా ఆయన ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ‘కల్ట్ బొమ్మ’ పేరుతో టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారని టాక్. దీంతో ఏ సినిమాకు ఈ పేరు పెడతారు అనే డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే ఎస్‌కేఎన్ నిర్మాణంలో వరుస సినిమాలు ఉన్నాయి. ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా పట్టాలెక్కించారు. మరోవైపు సంతోష్ శోభన్‌తో ఓ సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాల్లో దేనికి ‘కల్ట్ బొమ్మ’ అని టైటిల్ పెడతారో అనుకుంటున్నారు.
ఈ రెండు సినిమాల కోసమా లేక ఇంకేదైనా కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారా అనేది మరో డిస్కషన్. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రావొచ్చు. ఇక ‘బేబీ’ సినిమాను హిందీలో కూడా తీద్దాం అనే ప్లాన్ చేస్తున్నారట. మరి అక్కడ ఏం పేరు పెడతారు అనేది చూడాలి. కొత్త నటులతోనే ఈ సినిమా కూడా ఉంటుందని టాక్.