సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో అపురూప చిత్రం నర్తనశాల ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ చిత్రం ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో నర్తనశాల కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24 నుండి నెరవేరబోతోంది. ఇది నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు ఒక శుభవార్త.