తెలుగు ప్రజలకు అత్యంత ఇష్టమైన ఉగాది రోజున.. అనగా ఏప్రిల్ 8వ తేదీన నందమూరి బాలకృష్ణ నటించబోయే ప్రతిష్టాత్మక 100వ చిత్రం వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. శాతవాహనుల రాజధాని అయినటువంటి ధరణికోటలో ప్రకటన చేయనున్నారట. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో అమరావతికి దగ్గరలో ఉందీ ప్రాంతం. శాతవాహనుల వంశస్థుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవితగాథ ఆధారంగా.. ‘యోధుడు’ పేరుతో జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) చెప్పిన చారిత్రాత్మక కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది నిజమైతే..
ఉగాది రోజున నందమూరి అభిమానులకు రెండు పండగలు వచ్చినట్లే. తిధి ప్రకారం బాలయ్య మనవడు దేవాన్ష్ గతేడాది ఉగాది రోజున జన్మించాడు. ఈ ఏడాది ఉగాది పర్వదినాన వందో చిత్రం కబుర్లు చెప్పనున్నారు. దర్శకుల రేసులో పలువురి పేర్లు వినిపించినప్పటికీ.. వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాయని చెప్పారు. అయితే.. తన స్నేహితుడు రాజీవ్ రెడ్డితో కలసి క్రిష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తాజా సమాచారం.
క్రీ.పూ. ఒకటవ శతాబ్ద కాలంలో.. అమరావతి నేపథ్యంలో.. సాగే ఈ కథలో రాచరికపు హంగులు, యుద్ధ సన్నివేశాలకూ ప్రాముఖ్యత ఉందట. “ఏప్రిల్ 22 నుంచీ చిత్రీకరణ మొదలవుతుంది. మే నెలాఖరు వరకూ మొదటి షెడ్యూల్ కొనసాగుతుంది. అభిమానులతో కలసి పుట్టినరోజు జరుపుకోవడం కోసం బాలయ్య జూన్ నెలలో అమెరికా వెళతారు. తిరిగొచ్చిన తర్వాత చిత్రీకరణ మళ్లీ ప్రారంభమవుతుంద”ని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా ఉగాది రోజున ప్రకటిస్తారట.