నందమూరి బాలకృష్ణకు ఇదివరకు ఓవర్సీస్ లో పెద్దగా మార్కెట్ ఉండేది కాదు. ఆయన నటించే మాస్ సినిమాలు అక్కడి ప్రేక్షకులకు పెద్దగా నచ్చేవి కావు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి కొన్ని సినిమాలు మాత్రమే అమెరికాలో బాగా ఆడాయి తప్ప చాలా వరకు బాలయ్య సినిమాలు అక్కడ నిరాశ పరిచాయి. అయితే బాలయ్య చివరి సినిమా ‘అఖండ’ మాత్రం ఓవర్సీస్ లో బాగా ఆడింది. భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇప్పుడు బాలయ్య కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’ ప్రీ సేల్స్ కు అమెరికాలో వస్తున్న స్పదన చూసి అందరూ షాక్ అవుతున్నారు.
రిలీజ్ కు పది రోజుల ముందే ఈ సినిమా ప్రీ సేల్స్ ద్వారా లక్ష డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. అన్ని ఏరియాల్లో టికెట్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నార్మల్ గా అయితే బాలయ్య కంటే చిరంజీవి సినిమాలకు అమెరికాలో మార్కెట్ బాగా జరుగుతుంటుంది. చిరంజీవి నటించిన సినిమాలే ఎక్కువ లొకేషన్లు, స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంటాయి.
కానీ ‘వీరసింహారెడ్డి’కి మాత్రం చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ కంటే ఎక్కువ లొకేషన్లు, స్క్రీన్లు కేటాయించారు. టికెట్ అమ్మకాల్లో కూడా బాలయ్య సినిమాదే పైచేయి కనిపిస్తోంది. ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ కావడం, ‘అన్‌స్టాపబుల్’ షోతో బాలయ్యకు యూత్, క్లాస్ ఆడియన్స్ లో ఫాలోయింగ్ పెరగడంతో ‘వీరసింహారెడ్డి’ సినిమాపై బజ్ మరింత పెరిగింది.
ఇప్పటివరకు అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారా ‘వీరసింహారెడ్డి’ 1.61 లక్షల డాలర్లు వసూలు చేసింది. మరోపక్క ‘వాల్తేర్ వీరయ్య’ ప్రీ సేల్స్ ద్వారా 1.31 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.