బండ్ల గణేష్.. తనని విమర్శించిన వారికోసం కంటే.. పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వారిపై విరుచుకుపడటానికి మీడియా ముందుకు వచ్చే వ్యక్తి. బ్లాక్ బస్టర్ గణేష్ గా పేరు తెచ్చుకున్న ఇతను నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా చాలామందికి తెలుసు. ఇప్పుడు నేతగా అవతారమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో బండ్ల గణేశ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన బండ్ల గణేష్ ని కొన్ని ప్రశ్నలను అడగగా అతను కూల్ గా సమాధానమిచ్చారు.
కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో అవసరమైనప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తారా? అని ఒక విలేకరి ప్రశ్నించగా.. అందుకు అతను స్పందిస్తూ ..” పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించే ఛాన్సే లేదు. చచ్చినా పవన్ ను నేను విమర్శించను” అని అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ ఇప్పటికీ తనకి దేవుడే అని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ లో చేరడం గురించి స్పందిస్తూ.. “”చిన్నప్పటి నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. ఎంతో అభిమానం. నాకు రాజకీయాల్లోకి రావాలని అనిపించింది. రాహుల్ గాంధీ అంటే కూడా నాకు ఎంతో ఇష్టం. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను. ప్రజలకు మంచి సేవ చేయడానికి అవకాశం దొరికింది. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను” అని తెలిపారు.