నటుడిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ అతికొద్ది కాలంలోనే నిర్మాతగా ఎదిగారు. మెగా ఫ్యామిలీ హీరోలతో నాలుగు సినిమాలను నిర్మించారు. వారిలో పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కి చాలా ఇష్టం. అతని దేవుడని వర్ణిస్తుంటారు. పవన్ ని ఎవరైనా విమర్శించినా వారితో గొడవకి దిగుతుంటారు. అటువంటి వ్యక్తి తప్పకుండా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోనే చేరుతారని అందరూ అనుకున్నారు. కానీ జనసేన కార్యకర్తలకు షాక్ ఇస్తూ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో శుక్రవారం బండ్ల గణేశ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన బండ్ల గణేష్ అనేక ఆసక్తికర సంగతులు తెలిపారు. “చిన్నప్పటి నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. ఎంతో అభిమానం. నాకు రాజకీయాల్లోకి రావాలని అనిపించింది. రాహుల్ గాంధీ అంటే కూడా నాకు ఎంతో ఇష్టం. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను. ప్రజలకు మంచి సేవ చేయడానికి అవకాశం దొరికింది. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను” అని తెలిపారు. ఇంకా పవన్ గురించి మాట్లాడుతూ .. “పవన్ కళ్యాణ్ నాకు తండ్రిలాంటివారు. గురువు లాంటి వారు. అతనితో నాకు ఎటువంటి విభేదాలు లేవు” అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరమని అడిగితే వెళతారా? అని ప్రశ్నించగా.. “నేను గంట గంటకు ఒక పార్టీ మారే వ్యక్తిని కాదు. ముందు నుంచి నాకు రాజకీయ పరంగా కాంగ్రెస్ అంటే ఇష్టం. అందులోనే చేరాను” అని బండ్ల గణేష్ వివరించారు.