ఇప్పటివరకు అరుంధతిగా ముద్రపడిన స్వీటీ అనుష్క ఇక నుంచి భాగమతిగా గుర్తుండిపోతుంది. బాహుబలి తర్వాత అనుష్క చేసిన ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం నాడు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ భారీ కలక్షన్స్ వసూలు చేస్తోంది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఇప్పటివరకు 30 కోట్ల షేర్ ని వసూలు చేసి లేడీ సూపర్ స్టార్ అని అనిపించుకుంది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను మంచి క్రేజ్ ఉంది. యూఎస్ లోని 120 లొకేషన్లలో ప్రీమియర్ షోలు, శుక్రవారం ఓపెనింగ్స్ కలుపుకొని 2.79 లక్షల డాలర్లను రాబట్టిన ఈ చిత్రం శనివారం 2.63 లక్షల డాలర్లను అందుకుని మొత్తంగా 5.52 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది.
కేవలం రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ దాటిపోయింది. ఈ మూవీ ఆదివారం 1 .6 లక్షల డాలర్లు వసూలు చేసింది. దీంతో మొత్తం 7 లక్షల డాలర్లను వసూలు చేయగలిగింది. తాజాగా భాగమతి వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయింది. ఆదివారం(నిన్న)తో ‘భాగమతి’ సినిమా మిలియన్ డాలర్లను చేరుకుందని అక్కడి ట్రేడ్ వర్గాల వారు అధికారికంగా ప్రకటించారు. దీంతో మొదటిసారి హీరోయిన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఒక దక్షిణాది సినిమా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ మార్కును అందుకున్న రికార్డును భాగమతి సొంతం చేసుకుంది.