ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అల్లు అర్జున్. ‘దువ్వాడ జగన్నాథం’ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలతో అభిమానులను నిరాశపరిచిన బన్నీ..కొంచెం గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో ‘అల వైకుంఠపురములో’ చిత్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇలా త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ కూడా కంప్లీట్ చేసాడు. పాన్ ఇండియా సినిమాల స్థాయిలో ‘అల వైకుంఠపురములో’ చిత్రం కలెక్ట్ చేసింది. దాంతో అల్లు అర్జున్.. సుకుమార్ తో చేస్తున్న ‘పుష్ప’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించడానికి రెడీ అయ్యారు నిర్మాతలు. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ..
అలాగే ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్.. కలిసి చేస్తున్న చిత్రం ఇది. అందులోనూ వీరి కాంబినేషన్లో .. గతంలో ‘ఆర్య’ వంటి గేమ్ చేంజర్ సినిమా వచ్చింది. దాంతో ‘పుష్ప’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ‘పుష్ప’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసారు. అందులోనూ సుకుమార్.. మేకింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు. అందుకే ఈ సినిమా బడ్జెట్ భారీ రేంజ్లో ప్లాన్ చేశారట. అయితే వైరస్ మహమ్మారి వల్ల.. షూటింగ్ లు జరపడానికి అప్పటికంటే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయని వినికిడి. ఎక్కవగా అన్ని వస్తువులు అందుబాటులో ఉండడం లేదు.
వాటి కోసం ఎక్కువ ఖర్చులు పెట్టి నిర్మాతలు ఏర్పాటు చెయ్యాల్సి వస్తుందట. ఇక లాక్ డౌన్ నియమాలు ఎలాగూ ఉన్నాయి. అందుకే ‘పుష్ప’ చిత్రం బడ్జెట్ లో భారీగా కోతలు విధించడానికి నిర్మాతలు రెడీ అయ్యారట. అనవసరమైన హంగులు, ఆర్భాటాలు లేకుండా ఈ సినిమాని ఫినిష్ చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.అంతేకాదు బన్నీ,సుకుమార్ పారితోషికాల్లో కూడా కటింగ్లు ఉండబోతున్నాయని వినికిడి. ఇక ‘పుష్ప’ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘ముత్యంశెట్టి మీడియా’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.