దేశ రాజకీయాల్లో దక్షిణాది కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో, బీజేపీ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశాల్లో గట్టి పట్టు సంపాదించిన కమలనాథులు, దక్షిణాదిలో మాత్రం ఎదురెన్నికలకే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు సినిమా రంగానికి చెందిన ఇద్దరు స్టార్ నాయకుల ఆధారంగా దక్షిణ రాష్ట్రాల్లో దూసుకెళ్లేలా బీజేపీ స్ట్రాటజీ రెడీ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాగా, మరొకరు తమిళనాడు రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న టీవీకే పార్టీ అధినేత విజయ్ (Vijay Thalapathy).
పవన్ ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామిగా కొనసాగుతుండగా, ప్రధాని మోదీకి బహిరంగ మద్దతు ఇస్తూ వస్తున్నారు. మరోవైపు విజయ్ బీజేపీపై నేరుగా విమర్శలు చేయకపోయినా, జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీ స్వతంత్రంగా పోటీకి సిద్ధమవుతోంది. అయినా సరే, బీజేపీ మాత్రం విజయ్ ను కూడా కలుపుకొని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశిస్తోంది. తమిళనాడులో బీజేపీకి ప్రత్యక్షంగా బలమైన శక్తిగా ఎదగడం సాధ్యం కానిది కావడంతో, అన్నాడీఎంకే, టీవీకే లాంటి పార్టీలతో పొత్తులు అవసరమవుతాయని కమలదళం భావిస్తోంది.
ఇప్పటికే ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెడతామని సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో, టీవీకే కూడా అంగీకరిస్తే త్రికూట కూటమిగా డీఎంకేను ఎదుర్కోవచ్చన్నది బీజేపీ వ్యూహం. ఇందులో విజయ్ కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. ఇక పవన్ విషయంలో మాత్రం బీజేపీకి ఆశలు పెట్టుకోవడం కొత్తేం కాదు. జనసేనను భాగస్వామిగా ఉంచుకొని ఎంపీ సీట్లను గెలుచుకోవడమే కాకుండా, పవన్ స్టార్ ఇమేజ్ ను మరింతగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.
అదే ఫార్ములా విజయ్ కు కూడా వర్తించాలన్నదే వారి ప్లాన్. మొత్తానికి బీజేపీ ఇప్పుడు రాజకీయ రంగంలో ఒక మల్టీస్టారర్ స్క్రిప్ట్ రాస్తోంది. ఇందులో పవన్, విజయ్ లు కథానాయకులుగా ఉంటే, కమలదళం నిర్మాతలుగా మారి దక్షిణ భారత రాజకీయాల్లో తమ సినిమాను సక్సెస్ చేస్తుందేమో చూడాలి.