‘బాయ్‌కాట్ బాలీవుడ్’.. ఇప్పుడు హిందీ పరిశ్రమను ‘నిను వీడని నీడను నేను’ అంటూ వేధిస్తున్న రెండు పదాలు ఇవి. గతంలో ఏదో అన్నారని, ఆ మాట అన్న నటుడిని సపోర్టు చేశారని, కుర్ర హీరోలను అవకాశాలు ఇవ్వడం లేదని, వారసత్వాన్ని పెంచి పోషిస్తున్నారని, అందరికీ థియేటర్లు అందుబాటులో లేకుండా చేస్తున్నారని, మనోభావాలు దెబ్బ తీశారని.. ఇలా ఏదో ఒక కారణంగా బాలీవుడ్‌లో కొంతమంది సినిమాల్ని బాయ్‌కాట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ ‘ఇండస్ట్రీని చంపేసే’ ట్రెండ్ ‘లైగర్’కు తాకింది.
‘లైగర్’ సినిమా ప్రచారంలో భాగంగా విజయ్ దేవరకొండ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. అంతేకాదు ఇప్పుడు ‘లైగర్’ టీమ్ తలలుపట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ బాయ్‌కాట్ వీరులు అందరూ.. ఈ మధ్య ‘లాల్ సింగ్ చడ్డా’ అనే సినిమాను టార్గెట్ చేశారు. గతంలో ఆమిర్ ఖాన్ దేశం గురించి తన అభిప్రాయాన్ని చెప్పగా.. అది మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందని అప్పుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన సినిమా వచ్చినప్పుడల్లా ‘బాయ్‌కాట్’ అంటూ కత్తిపట్టుకుని తిరుగుతున్నారు. అలా ‘లాల్ సింగ్ చడ్డా’కు కనీస ఓపెనింగ్స్ కూడా లేకుండా చేశారు.
ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించిన ‘షారుఖ్ ఖాన్’ నెక్స్ట్ సినిమా ‘పఠాన్’ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించారు బాలీవుడ్ బాయ్‌కాట్ వీరులు. ఆ తర్వాత ‘లాల్..’ సినిమాను సపోర్టు చేస్తూ మాట్లాడిన హృతిక్ రోషన్ మెడ మీద కూడా బాయ్‌కాట్ కత్తి వేలాడుతోంది. ‘విక్రమ్ వేద’ సినిమా రిలీజ్ చేస్తావుగా అప్పుడు చూసుకుందాం అని అంటున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితే తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈయనేం చేశాడు అని అంటారా. ఇంకేముంది ఆమిర్ ఖాన్ సినిమా గురించి మాట్లాడాడు.
‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాను బ్యాన్ చేయడం వల్ల ఆమిర్ ఖాన్‌కు వచ్చే నష్టం సంగతి పక్కన పెడితే.. ఆ సినిమా కోసం పని చేసిన ఎంతోమంది కార్మికులు ఇబ్బంది పడతారు. సినిమాను బాయ్ కాట్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి విజయ్ ఈ మాటలు అన్నాడు. అయితే ఈ మాటలతో బాయ్‌కాట్ వీరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ‘లైగర్’ను కూడా బాయ్‌కాట్ చేస్తాం అని సోషల్ మీడియాలో వార్నింగ్‌లు ఇస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా నిర్మాత కరణ్ జోహార్ కాబట్టి.. ఆ దిశగా కూడా ఈ సినిమాను బాయ్‌కాట్ చేస్తామంటున్నారు.
అయితే, ఈ విషయంలో విజయ్ దేవరకొండకు కొంతమంది నెటిజన్ల నుండి సపోర్టు వస్తోంది. అతను స్వయంశక్తితో ఎదిగిన నటుడు అని, అతని సినిమాను బాయ్‌కాట్ చేయొద్దని కోరుతున్నారు. దీంతో బాయ్‌కాట్ వర్సెస్ నాన్ బాయ్‌కాట్ బృందాల మధ్య చర్చ జోరుగా నడుస్తోంది. మరి కథ సరిగ్గా లేని ‘లాల్ సింగ్ చడ్డాను’ బాయ్ కాట్ చేసి విజయం సాధించిన బాయ్ కాట్ వీరులు.. ‘లైగర్’ విషయంలో ఏం చేస్తారో చూడాలి.