‘సీనియర్ స్టార్ హీరోల హవా ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు చాలా వరకు తగ్గింది’… అని అంతా అనుకుంటున్నారు. ఒకప్పటిలా అభిమానులు వీళ్ళ సినిమాల కోసం థియేటర్లకు పరుగులు పెట్టడం, క్యూలో నిలబడి టికెట్ల కోసం ఆరాటపడటం వంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇది వాస్తవం. అయితే ఇలాంటి టైంలో కొంతమంది దర్శకులు వీళ్ళ ఇమేజ్ కి ఉన్న పవర్ ను గుర్తు చేస్తూ బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి.. వంటి దర్శకులను చెప్పుకోవచ్చు.
Balakrishna, Venkatesh
‘పాండురంగడు’ ‘మిత్రుడు’ వంటి సినిమాల టైంలో ‘బాలకృష్ణ ఇక రిటైర్ అవ్వడం బెటర్’ అని స్వయంగా వాళ్ళ అభిమానులే కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి టైంలో బోయపాటి శ్రీను బాలయ్యని ఆదుకున్నాడు. బాలయ్య ప్లస్ పాయింట్ మాస్. దాన్ని గుర్తు చేస్తూ తీసిన ‘సింహా’ సినిమా తర్వాతే బాలయ్య మళ్ళీ పుంజుకుంటున్నాడు. ‘లెజెండ్’ ‘అఖండ’ వంటి సినిమాలతో బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి ఊపు ఇచ్చాడు బోయపాటి.
సరిగ్గా బాలయ్యలానే వెంకటేష్ కూడా హిట్లు కొట్టలేక సినిమాలు తగ్గించేశాడు.’స్టార్ హీరోలతో మల్టీస్టారర్లు చేస్తే తప్ప వెంకీ ఇక నెగ్గుకురాలేడు’ అని అంతా అనుకుంటున్న టైంలో.. అనిల్ రావిపూడి.. ఆ కామెంట్స్ కి బ్రేకులు వేశాడు. వెంకటేష్ ప్లస్ పాయింట్స్ కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్. వీటిని గుర్తు చేస్తూ ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ వంటి సినిమాలు చేశాడు. అవి సూపర్ హిట్లు అయ్యాయి. వాస్తవానికి ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ .. కూడా మల్టీస్టారర్ సినిమాలే. కానీ మరో హీరోగా చేసిన వరుణ్…. వెంకీ రేంజ్ స్టార్ కాదు.
పైగా ఆ సినిమాల్లో ఎక్కువగా హైలెట్ అయ్యింది వెంకీ కామెడీ టైమింగ్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇక తాజాగా వెంకటేష్ ని సోలో హీరోగా పెట్టి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా తీశాడు అనిల్ రావిపూడి. ఇందులో వెంకీ కామెడీ టైమింగ్ ని, ఎనర్జీని, అతని ఫ్యామిలీ ఇమేజ్ ని బాగా వాడుకున్నాడు. కట్ చేస్తే ఇది కూడా బ్లాక్ బస్టరే. ఈ సినిమాతో వెంకీని రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేర్చబోతున్నాడు అనిల్ రావిపూడి.