ఓ పెద్ద సినిమాకి సంబంధించి లిరికల్ సాంగ్స్ అనేవి… ఆ సినిమా ప్రమోషన్లకు బాగా ఉపయోగపడుతుంటాయి. అవి క్లిక్ అయితేనే సినిమాకి క్రేజ్ పెరుగుతుంది. మన త్రివిక్రమ్ కి ఈ విషయం బాగా తెలుసు. అందుకే ‘అల వైకుంఠపురములో’ సినిమా మొదటి లిరికల్ సాంగ్ అయిన ‘సామజవరగమన’ న కోసం ఏకంగా రూ.1 కోటి ఖర్చుచేయించాడు. ఆ పాటకి వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. అదే కల్చర్ ను ఇప్పుడు టాలీవుడ్ ఫాలో అవుతుంది.
‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ కు కూడా రూ.70 లక్షల వరకు ఖర్చు చేశారు. సింగర్స్ మరియు సంగీత దర్శకుడు కనిపిస్తారు కాబట్టి.. ఈ పాటలకి ఎక్కువే ఖర్చు అవుతుంది. తాజాగా ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ కు కూడా భారీగానే ఖర్చు చేశారు. ‘కళావతి’ అంటూ సాగే ఈ పాటకి తమన్ అందించిన ట్యూన్ ఆకట్టుకుంటుంది. మధ్యలో సింగర్ సిద్ శ్రీరామ్ అలాగే బ్యాక్ గ్రౌండ్ సింగర్స్ కూడా కనిపించడం ఈ పాటకి మరింత ఆకర్షణ చేకూరేలా చేసింది.
అయితే ‘కళావతి’ పాట కోసం అక్షరాలా రూ.60 లక్షలు ఖర్చు చేశారట నిర్మాతలు. సినిమా ప్రమోషన్లకు ఇవే అత్యంత కీలకం కాబట్టి నిర్మాతలు కూడా వెనుకాడలేదట. నిజానికి ఈ పాటని వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ ముందుగానే ఈ పాట నెట్లో లీక్ అవ్వడం వలన నిన్నే హడావిడిగా విడుదల చేశారు. నెట్లో లీక్ అయినప్పటికీ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తూనే ఉంది ‘కళావతి’ లిరికల్ సాంగ్.