‘బాహుబలి’ సినిమా విడుదలనప్పటి నుంచి టాలీవుడ్ సినిమాల బడ్జెట్ లు బాగా పెరిగిపోయాయి. వంద కోట్లు, రెండొందలు కోట్లు, ఐదొందలు, వెయ్యి కోట్ల వరకు బడ్జెట్ లు పెట్టడానికి రెడీ అయిపోతున్నారు నిర్మాతలు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి రూ.500 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. ఆ డబ్బు ఎలా రాబట్టుకోవాలో..? రాజమౌళికి బాగా తెలుసు. అందుకే అతడి సినిమాలకు ఎంత ఖర్చయినా నిర్మాతలు వెనకడుగు వేయడం లేదు. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందించబోయే సినిమాకి రూ.800 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు టాక్.
‘ఆర్ఆర్ఆర్’ తరువాత మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు రాజమౌళి. ఈ సినిమా కథ ఏంటి..? ఏ జోనర్ తో తెరకెక్కుతోందనే విషయంపై చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. మహేష్ ని రాజమౌళి ‘జేమ్స్ బాండ్’గా చూపిస్తాడని అంటున్నారు. ఇప్పుడు అదే నిజం కాబోతుందని సమాచారం. జేమ్స్ బాండ్ లాంటి కథతోనే రాజమౌళి ఈ సినిమా చేయబోతున్నారట. దానికి రూ.800 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. చివరి క్షణాల్లో సినిమా బడ్జెట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్టామినా రూ.2000 కోట్లు కాబట్టి.. ఎలాగైనా డబ్బుని తిరిగి రాబట్టుకోవచ్చనేది రాజమౌళి నమ్మకం. పైగా ఈ సినిమాని హాలీవుడ్ లో కూడా విడుదల చేయాలనుకుంటున్నారట.జేమ్స్ బాండ్ లాంటి స్టైలిష్ యాక్షన్ సినిమాలను హాలీవుడ్ లో బాగానే చూస్తారు. పూర్తిగా ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తారని.. ఆ రకంగా రూ. 800 కోట్లు రాబట్టుకోవడం పెద్ద విషయం కాదని భావిస్తున్నారట రాజమౌళి.
ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. అది పూర్తయితే కానీ రాజమౌళి సినిమాను మొదలుపెట్టలేరు.