1948 లో చోటు చేసుకున్న బైరాన్ పల్లి ఘటన ఆధారంగా తెరకెక్కిన తెలుగు సినిమా “ఛాంపియన్”. రోషన్ మేక పూర్తిస్థాయి కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా మలయాళ నటి అనస్వర తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. స్వప్న సినిమా సంస్థ ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగింది? దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఎంత నిజాయితీగా సదరు బైరాన్ పల్లి మారణహోమాన్ని, ఆ ఊరి ప్రజల ధీరత్వాన్ని తెరకెక్కించాడు అనేది చూద్దాం..!!

కథ: ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ఫుట్ బాల్ ఆడాలి అనేది మైఖేల్ (రోషన్ మేక) ధ్యేయం. ఆ ధ్యేయానికి అతడి తండ్రి వీరత్వం అడ్డంకిగా నిలుస్తుంది. తాను అనుకున్నది సాధించాలంటే.. తుపాకులను బీదర్ లో డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అనుకోని విధంగా బీదర్ వెళ్లాల్సిన మైఖేల్.. బైరాన్ పల్లిలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత అక్కడ చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే “ఛాంపియన్” చిత్రం.

నటీనటుల పనితీరు: నటుడిగా రోషన్ మంచి పరిణితి ప్రదర్శించాడు. అతడి లుక్స్ లో కాన్ఫిడెన్స్, అతడి మాటల్లో కచ్చితత్వం, నటనలో ఈజ్ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయితే.. ఎక్కడ ఎమోషన్ కి ఒక హై ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలి, ఎక్కడ తగ్గాలి అనే విషయంలో ఇంకాస్త క్లారిటీ అవసరం. ఆ ఒక్క విషయంలో పట్టు సాధిస్తే రోషన్ కి అద్భుతమైన భవిష్యత్ ఖాయం.
సినిమాలో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ.. బాగా హైలైట్ అయ్యింది మాత్రం రచ్చ రవి పాత్ర. ఇప్పటివరకు రచ్చ రవి అంటే లేకి కామెడీ పాత్రలు మాత్రమే ఇచ్చారు. కానీ.. ఈ సినిమాలో మాత్రం రచ్చ రవికి అద్భుతమైన ఎలివేషన్ ఇవ్వడమే కాక, అతడిలోని నటుడ్ని ప్రేక్షకులకి పరిచయం చేసుకున్నాడు. ఇకనుంచైనా రవికి మంచి పాత్రలు పడాలి.
అనశ్వర రాజన్ సొంత డబ్బింగ్ చెప్పుకోవడం ప్రశంసార్హం. అయితే.. ఆమె వాయిస్ ఎందుకో అనుపమ పరమేశ్వరన్ ను గుర్తుచేసింది. నటిగా చాలా ఒద్దికగా చంద్రకళ పాత్రలోకి ఒదిగిపోయింది.
నందమూరి కళ్యాణ్ చక్రవర్తి చాలా సంవత్సరాల తర్వాత వెండితెరపై కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ వల్ల పెద్దరికం వచ్చింది కానీ.. తెలంగాణ యాస విషయంలో కానీ, డైలాగ్ డెలివరీ విషయంలో ఆయన సినిమాకి ప్లస్ అవ్వలేకపోయాడు.
బలగం సంజయ్, అర్చన, కేకే మీనన్, మురళీశర్మ తదితరులు తమ తమ పాత్రలకి న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: మిక్కీ జె.మేయర్ సౌండింగ్ బాగుంది. గిరా గిరా పాట ఆడియన్స్ ని సినిమాకి తీసుకువడంలో కీలకపాత్ర పోషించింది. బ్యాగ్రౌండ్ సౌండ్ వర్క్ కూడా బాగుంది.
సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది కానీ.. సీజీ ఆ అవుట్ పుట్ కి సపోర్ట్ చేయలేదు. అందువల్ల చాలా చోట్ల సినిమాటోగ్రఫీ వర్క్ పేలవంగా కనిపిస్తుంది. అది సినిమాటోగ్రాఫర్ తప్పు కాదు.
కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ విషయంలో నెగ్గుకొచ్చారు కానీ.. గ్రాఫిక్స్ విషయంలో మాత్రం సినిమా తేలిపోయింది. 40 కోట్లు ఖర్చు అక్కడ మాత్రం కనిపించలేదు. అలాగే యాక్షన్ బ్లాక్స్ కూడా తేలిపోయాయి.
దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఎంచుకున్న పాయింట్ మంచిదే. ఫుట్ బాల్ ను భైరాన్ పల్లి ఘటనలోకి మిళితం చేసిన విధానం బాగుంది. అయితే.. ఆ సంఘటనను నిజాయితీ చూపించలేకపోయాడు ప్రదీప్. ఆ ఘటన తీవ్రత ఎలాంటిది అనే విషయం అందరికీ తెలిసిందే.. అలాంటి ఘటనను సినిమాగా తెరకెక్కిస్తున్నప్పుడు కచ్చితంగా నాటకీయత అనేది తప్పదు. కానీ.. ఆ ఘటన యొక్క గొప్పదనాన్ని తక్కువ చేసేలా ఉండడం అనేది జీర్ణించుకోలేం. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే.. ఆ మారణకాండ యొక్క మనోగతాన్ని ఘనంగా వెండితెరపై ప్రెజెంట్ చేసే అవకాశం పుష్కలంగా ఉన్నప్పటికీ.. రాత విషయంలో ఇంకాస్త సిన్సియర్ గా ఉండి ఉంటే బాగుండేది. ఒక దర్శకుడిగా, రచయితగా ప్రదీప్ బొటాబొటి మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

విశ్లేషణ: ఈ తరహా రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ సినిమాలకి ఎమోషన్ చాలా కీలకం. అలాగే.. వరల్డ్ బిల్డింగ్ కూడా. ఈ రెండు విషయాల్లో “ఛాంపియన్” నెగ్గుకురాలేకపోయాడు. అయితే.. నటీనటుల పనితీరు, మిక్కీ సంగీతం, సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. చరిత్రను నిక్కచ్చిగా చెప్పకపోయినా.. ఆ ఘటన తాలూకు తీవ్రతను కొంతమేరకు చూపించగలిగారు. సీజీ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అయితే.. రోషన్ నటన, కొన్ని సన్నివేశాల్లో పండిన ఎమోషన్ కోసం “ఛాంపియన్”ను చూడొచ్చు!

ఫోకస్ పాయింట్: నిజానికి నాటకీయతకి నడుమ నిశ్చేష్టుడైన ఛాంపియన్!
రేటింగ్: 3/5
