ఏంటో ఈమధ్య మెగాఫ్యామిలీ హీరోలందరూ రీమేక్ సినిమాలపై పడ్డారు. ఆల్రెడీ రామ్ చరణ్ “లూసిఫెర్, డ్రైవింగ్ లైసెన్స్” చిత్రాల రీమేక్ రైట్స్ కొనుక్కొని ఒకటి తండ్రి చిరంజీవి హీరోగా, మరొకటి వెంకటేష్ హీరోగా నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకొంటుండగా.. ఇప్పుడు మెగాస్టార్ కన్ను మరో రీమేక్ పై పడిందని తెలుస్తోంది. అదే అజిత్ కథానాయకుడిగా నటించగా తమిళంలో ఘన విజయం సొంతం చేసుకొన్న “వేదాళం”. నిజానికి ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రీమేక్ చేయాలనుకున్నారు ఏ.ఎం.రత్నం. పూజా కార్యక్రమాలు కూడా జరిగిన ఆ చిత్రం ఎందుకో ఆగిపోయింది.
ఆ తర్వాత ఆ రీమేక్ ను మళ్ళీ ఎవరూ టచ్ చేయలేదు.అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మెహర్ రమేష్ ఆ రీమేక్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసాడని, ఆ వెర్షన్ మెగాస్టార్ చిరంజీవికి విపరీతంగా నచ్చేసిందని.. ఎలాగూ సుజీత్ తో అనుకున్న లూసిఫర్ రీమేక్ పట్టాలెక్కడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి కొరటాలతో “ఆచార్య” అనంతరం మెహర్ తో వేదాళం మొదలెట్టే ఆలోచనలో ఉన్నారు మెగాస్టార్.
అంతా బాగానే ఉంది కానీ.. సినిమాలో హీరోది ఒక 20 ఏళ్ల అమ్మాయికి అన్నయ్య పాత్ర.. ఎంత చిరంజీవిని ఆయన అభిమానులందరూ అన్నయ్య అని పిలుచుకుంటున్నప్పటికీ.. 64 ఏళ్ల వయసులో ఆయన అన్నయ్యగా నటిస్తే సూట్ అవుతుందా లేదా అనే టెన్షన్ కూడా కొందరికి ఉంది. మరి మెహర్ చేసిన మార్పులు ఎలాంటివో, అవి మెగాస్టార్ స్టార్ డమ్ & ఏజ్ కి ఎలా సూట్ అవుతాయో చూడాలి.