‘‘కె.విశ్వనాథ్ సంతాప సభ.. ఓ సభలా కాదు సంబరంలా ఉండాలి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని అందరూ పంచుకోవాలి అనుకున్నాం. అందుకే ఇలా ఏర్పాటు చేసుకున్నాం’’ అని చెప్పారు ప్రముఖ నటుడు చిరంజీవి. కె.విశ్వనాథ్ జయంతి సందర్భంగా ‘కళాతపస్వకి కళాంజలి’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తనను తెరపై కొత్తగా ఆవిష్కరించిన దర్శకుడు కె. విశ్వనాథ్ గురించి, నాటి రోజుల గురించి గుర్తుచేసుకున్నారు. సున్నితంగా నటించడం ఆయన దగ్గరే నేర్చుకున్నానని చిరంజీవి తెలిపారు.
‘కళాతపస్వకి కళాంజలి’ కార్యక్రమానికి చిరంజీవి సహా విశ్వనాథ్‌తో కలసి పనిచేసిన చాలామంది నటులు హాజరై ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. దర్శకులు కాశీ విశ్వనాథ్, వీఎన్ ఆదిత్య, ఏడిద రాజా, పీపుల్ మీడియా సంస్థ, టి. సుబ్బరామిరెడ్డి తదితరులు కలసి ఈ కార్యక్రమం నిర్వహించారని చిరంజీవి చెప్పారు. ‘‘నా నటనను సరిదిద్దిన గురువుగా ఆయనను భావిస్తాను. నాకు ఆయన మూడు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాల చిత్రీకరణ సమయంలో ఆయన చూపించిన ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అని అన్నారు చిరంజీవి.
‘శుభలేఖ’ షూటింగ్‌సమయంలో ఆయన నా దగ్గరకు ఆయన వచ్చి ‘నిన్ను ఎవరైనా తరుముతున్నారా? అంత వేగంగా డైలాగ్ చెబుతున్నావు’ అని అన్నారు. కంగారు అనిపిస్తోంది అని నేను అన్నాను. అలా డైలాగ్ చెప్పడంలో నా వేగాన్ని నియంత్రించి, సరిగ్గా చెప్పడానికి తొలి కారణం ఆయనే అని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. మాస్ యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు ‘స్వయంకృషి’ సినిమా కథ వినిపించారు. ఆ తర్వాత మా కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆపద్బాంధవుడు’ మరో అపురూప చిత్రం.
ఓసారి ‘ఆపద్బాంధవుడు’ సెట్స్‌లో చిరంజీవి బెత్తం లాంటిది పట్టుకుని తిరుగుతుంటే.. ఆ స్టైల్ చూసి నచ్చి.. అలా డ్యాన్స్ చేస్తావా అని అడిగారట కె.విశ్వనాథ్. అలా నటుల్లోని ఒరిజినాలిటీని చక్కగా రాబట్టుకునేవారని చెప్పారు చిరు. ఇక క్లాసికల్ డ్యాన్స్ విషయంలో కె.విశ్వనాథ్ చెప్పేంతవరకు తాను అంత బాగా చేయగలనని తనకు తెలియదని చిరు చెప్పుకొచ్చారు.