‘డైలాగ్ కింగ్’ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సాయి కుమార్ అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు. హీరోగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సహాయ నటుడుగా, విలన్ గా ఆయన ఎన్నో సినిమాలకు పనిచేశారు. అయితే సాయి కుమార్ కెరీర్ గురించి చెప్పాలి అంటే.. ‘పోలీస్ స్టోరీ’ కి ముందు ‘పోలీస్ స్టోరీ’ తర్వాత అని చెప్పాలి.సాయి కుమార్ అనే పేరు చెప్పగానే అందరికీ కూడా ‘పోలీస్ స్టోరీ’ సినిమానే గుర్తొస్తుంది. ఈ చిత్రం తర్వాత ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్ మెన్ అగ్నిగా ఈయన నటన అద్భుతం.
‘కనిపించే మూడు సింహాలు.. నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే.. కనబడని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ సాయి కుమార్ చెప్పిన డైలాగ్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘ఇప్పటికీ ఆ డైలాగ్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తుంటుంది’ అని చెప్పడంలో కూడా అతిశయోక్తి అనిపించుకోదు. అయితే పోలీస్ స్టోరీకి సాయి కుమార్ మొదటి ఛాయిస్ కాదు. ఓ పక్క కన్నడ సినిమాల్లో హీరోగా..మరోపక్క తెలుగు సినిమాల్లో విలన్ గా చేస్తూ వచ్చిన దేవ రాజ్ ను మొదట ఆ సినిమాలో హీరోగా అనుకున్నారు.
అయితే కథ ప్రకారం.. ‘పొలీస్ స్టొరీ’ లో హీరోయిన్ ఉండదు.. రొమాన్స్, పాటలు వంటి వాటికి స్కోప్ లేదు. అందుకే ఆ సినిమాని దేవరాజ్ తో పాటు కన్నడ లో పెద్ద హీరోలు చేయలేదు. దీంతో దర్శకుడు థ్రిల్లర్ మంజు.. సాయి కుమార్ తో ఆ ప్రాజెక్టుని రూపొందించాడు. అయితే సాయి కుమార్ తో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేశాడు కానీ.. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు.
దీంతో చిరుని ఆశ్రయించాడు సాయి కుమార్. మొదట (Chiranjeevi) చిరు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఇష్టపడలేదు. ఒకవేళ సినిమా బాగోకపోతే .. తనను నమ్మి వచ్చిన ప్రేక్షకుల్ని మోసం చేసినట్టే అని చిరు చెప్పారట. కానీ సాయి కుమార్ వదలకుండా.. ‘ముందు మీరు సినిమా చూడండి. నచ్చితే బాగుంది అని ప్రమోట్ చేయండి. లేదు అంటే లేదు’ అని అనడంతో చిరు .. టైం చూసుకుని ఆ సినిమాని చూడడానికి వెళ్లారట.
సినిమా చూస్తున్న టైంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి .. ఆపేస్తే చిరు తెగ కోప్పడ్డారట. అంతలా ఆయనకు సినిమా నచ్చేసింది. సినిమా చూశాక చిరు .. బాగుంది అని మీడియా ముందు చెప్పడంతో తెలుగులో ఈ చిత్రం హక్కులను కొనుగోలు చేయడానికి మేకర్స్ ముందుకొచ్చారు. తర్వాత ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.