డ్యాన్స్ బాగా చేసే హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. ఇంకా చెప్పాలంటే సాయిపల్లవి లాంటి బెస్ట్ డ్యాన్సర్ రీసెంట్ హీరోయిన్స్‌లో లేరనే చెప్పాలి. స్వతహాగా డ్యాన్సర్ కావడం, గతంలో కొన్ని డ్యాన్స్ షోస్‌లో పాల్గొనడం తదితర కారణాల వల్ల ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఆమె డ్యాన్స్ వెనుక చిరంజీవి ఉన్నారని తెలుసా? అదేంటి హీరోల డ్యాన్స్‌ల, ప్యాషన్ వెనుక చిరంజీవి ఉన్నారంటే నమ్మొచ్చు కానీ హీరోయిన్ డ్యాన్స్ వెనుక చిరంజీవినా అని అనుకుంటున్నారా? కానీ మీరు చదివింది నిజం. సాయిపల్లవి మెస్మరైజింగ్ డ్యాన్స్ వెనుక ఉన్నది చిరు ఇచ్చిన ఇన్‌స్పిరేషనే.
చిన్నప్పుడు చిరంజీవి ‘ముఠామేస్త్రీ’ సినిమాను సాయిపల్లవి తెగ చూసేదట. సినిమాలో చిరు డాన్స్‌కి ఫిదా అయిపోయి.. తను కూడా డాన్సర్ కావాలని అనుకుందట. అలా డ్యాన్సర్ అయ్యి, ఆ తర్వాత డాక్టర్ అయ్యి, ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. ఈ మధ్య ఓ కార్యక్రమంలో ‘నాతో కలిసి ఒక స్టెప్పు వేస్తావా’ అని చిరంజీవి అడిగి మరీ డాన్స్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం అని చెప్పింది సాయిపల్లవి. ‘ఫిదా’లోని ‘వచ్చిండే…’ పాటను ఎన్ని సార్లు చూశానో అని అల్లు అర్జున్ చెప్పడం తనకు ఎప్పటికీ మర్చిపోలేని ప్రశంస అని చెప్పింది సాయిపల్లవి.
సాయిపల్లవి మాతృభాష బడగ అంట. ఆమె తెగకు సంబంధించిన వారంతా అదే భాషలో మాట్లాడతారట. అయితే ఆ భాషకు లిపి లేదట. అలానే తెలుగు, తమిళ, మలయాళ, ఇంగ్లిష్, హిందీ, జార్జియన్ భాషలు మాట్లాడటం వచ్చట సాయిపల్లవికి. చిన్నతనం నుండి సూర్య అంటే క్రష్ అట సాయిపల్లవికి. సూర్యతో ఒక్క సినిమాలో అయినా నటించాలనుండేది… ఆ కోరిక ‘ఎన్‌జీకే’తో తీరింది అని చెబుతూ సరదా పడిపోయింది సాయిపల్లవి.
చూడటానికి ఫిట్‌గా ఉంటారు.. ఏం వర్కౌట్లు చేస్తుంటారేంటి అని అడిగితే… పెద్దగా వర్కవుట్స్ లాంటివి చేయను గానీ, వారంలో మూడుసార్లు బ్యాడ్మింటన్ మాత్రం ఆడతా. కుదిరినప్పుడల్లా డాన్స్ చేస్తుంటా అని చెప్పింది మన ‘వెన్నెల’. అలాగే ‘అమృత’ సినిమా చూసినప్పట్నుంచీ అమ్మానాన్నలు తనను దత్తత తీసుకున్నారేమోననే అనుమానం కలుగుతుంటుంది అని చెబుతూ నవ్వేసింది సాయిపల్లవి. ఇదే విషయం అప్పుడప్పుడూ ఇంట్లో అడుగుతుంటుందట. ఆమె వెన్నెలగా నటించిన ‘విరాట పర్వం’ ఈ నెల 17న విడుదలవుతోంది.