మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. గతంలో కూడా చిరు నటించిన సినిమాలు సంక్రాంతి బరిలో తలబడ్డాయి. అందులో కొన్ని భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఒకసారి చిరు సంక్రాంతి ట్రాక్ రికార్డు ఎలా ఉందో చెక్ చేద్దాం రండి :
1) తాయారమ్మ బంగారయ్య: కైకాల సత్యనారాయణ, షావుకారు జానకి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి కొమ్మినేని శేషగిరి రావు దర్శకుడు. 1979 సంవత్సరం జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. చిరంజీవి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఇది అంతంత మాత్రంగా ఆడింది.

2) ఆడవాళ్లు మీకు జోహార్లు: కృష్ణంరాజు, జయసుధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి కె.బాలచందర్ దర్శకుడు. 1981 జనవరి 15న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. చిరంజీవి ఇందులో అతిధి పాత్ర పోషించారు. అయితే సినిమా అంతగా ఆడలేదు.

3) ప్రేమ పిచ్చోళ్ళు: చిరంజీవి, రాధికా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏ.కోదండరామిరెడ్డి దర్శకుడు. 1983 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ అన్నట్టు ఆడింది.

4) చట్టంతో పోరాటం: చిరంజీవి హీరోగా మాధవి, సుమలత హీరోయిన్లుగా కె.బాపయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. 1985 జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవికి మొదటి సంక్రాంతి హిట్ అందించిన సినిమా ఇదే కావడం విశేషం.

5) దొంగ మొగుడు: చిరంజీవి హీరోగా మాధవి, రాధిక, భాను ప్రియా హీరోయిన్లుగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన టిపికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో చిరు డబుల్ రోల్ ప్లే చేశారు. 1987 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్నే సొంతం చేసుకుంది.

6) మంచి దొంగ: చిరంజీవి హీరోగా విజయశాంతి,సుహాసిని..లు హీరోయిన్లుగా రూపొందిన మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఇది. కె.రాఘవేంద్ర రావు దర్శకులు. 1988 జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

7) అత్తకు యముడు అమ్మాయికి మొగుడు: చిరంజీవి హీరోగా విజయశాంతి హీరోయిన్ గా రూపొందిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. వాణిశ్రీ ఏ సినిమాలో కీలక పాత్ర పోషించారు.ఏ.కోదండరామిరెడ్డి దర్శకులు. 1989 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

8) స్థూవర్టుపురం పోలీస్ స్టేషన్: చిరంజీవి హీరోగా విజయశాంతి, నిరోషా హీరోయిన్లుగా రూపొందిన యాక్షన్ మూవీ ఇది. సుప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ చిత్రంతో దర్శకులుగా పరిచయమయ్యారు. 1991 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ఆడియన్స్ ని అలరించలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.

9) ముఠామేస్త్రి: చిరంజీవి హీరోగా మీనా, రోజా హీరోయిన్లుగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది.1993 లో సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల జనవరి 17న రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

10) ముగ్గురు మొనగాళ్లు: చిరంజీవి త్రిపాత్రాభినయం కనపరిచిన సినిమా ఇది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. రోజా,నగ్మా,రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. 1994 జనవరి 7న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. అయితే బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని మాత్రమే సాధించింది.
11) హిట్లర్: చిరంజీవి హీరోగా రంభ హీరోయిన్ గా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. 1997 జనవరి 4న సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేసి రిలీజ్ అయ్యింది ఈ చిత్రం. దీనికి ముందు చిరు వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. అలాంటి టైంలో వచ్చిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది.
12) స్నేహం కోసం: చిరంజీవి డబుల్ రోల్ ప్లే చేసిన సినిమా ఇది. మీనా హీరోయిన్ గా నటించగా తమిళ నటుడు విజయ్ కుమార్ అత్యంత కీలక పాత్ర పోషించారు. 1999 జనవరి 1న సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేసి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలిపోయింది.
13) అన్నయ్య: చిరంజీవి హీరోగా సౌందర్య హీరోయిన్ గా రవితేజ, వెంకట్ కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇది. ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. 2000 సంవత్సరం జనవరి 7న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయితే చిరు మార్క్ కామెడీ, మణిశర్మ సంగీతం వర్కౌట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
14) మృగరాజు: చిరంజీవి హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా తెరకెక్కిన అడ్వెంచరస్ మూవీ ఇది. గుణశేఖర్ దర్శకత్వం వహించారు. 2001 జనవరి 11న రిలీజ్ అయ్యింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది.
15) అంజి: చిరంజీవి హీరోగా నమ్రత హీరోయిన్ గా రూపొందిన సోషియో ఫాంటసీ మూవీ ఇది. కోడి రామకృష్ణ దర్శకుడు. 2004వ సంవత్సరం జనవరి 15న రిలీజ్ అయ్యింది ఈ చిత్రం. మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది.

16) స్టైల్: లారెన్స్ హీరోగా దర్శకుడిగా చేసిన ఈ సినిమా 2006 జనవరి 12న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో చిరు గెస్ట్ రోల్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
17) ఖైదీ నెంబర్ 150: పొలిటికల్ ఎంట్రీ తర్వాత చిరు రీ ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాతోనే..! వి.వి.వినాయక్ దర్శకుడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. 2017 జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

18) వాల్తేరు వీరయ్య: చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన మాస్ అండ్ యాక్షన్ మూవీ ఇది. రవితేజ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. 2023 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక 2026 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చిరు. వెంకటేష్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
