చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కొత్తల్లో ఏడాదికి ఒకటో, రెండో సినిమాలే చేస్తాడు, వయసైపోతోంది కదా అని అనుకున్నారు కొందరు. అయితే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటూ.. ఏ స్టార్ కూడా చేయని (ప్రభాస్ తప్ప) విధంగా ఏక కాలంలో మూడు సినిమాల్ని సెట్స్ మీద పెట్టాడు చిరంజీవి. దీంతో అంతా అవాక్కవ్వాల్సి వచ్చింది. అయితే చిరంజీవి ఈ మూడు సినిమాలతో మరో మూడు సినిమాల్ని ఒకేసారి పట్టాలెక్కించాలని చూస్తున్నారా? అవుననే అనిపిస్తోంది ఆయన మాటలు వింటుంటే.
ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న సినిమాలు, చేస్తాను అని మాటిచ్చిన సినిమాలు చూస్తే ఈ విషయం ఎవరికైనా క్లియర్‌గా అర్థమైపోతుంది. చిరంజీవి ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్’ చేస్తున్నారు. ఇది కాకుండా మెహర్ రమేశ్‌తో ‘భోళా శంకర్’ రెడీ చేస్తున్నారు. అలాగే బాబీ డైరక్షన్ ‘వాల్తేరు వీరయ్య’ అవతారం కూడా ఎత్తనున్నారు. ఈ మూడు సినిమాల్ని ఏక కాలంలో షెడ్యూల్స్ వారీగా షూట్ చేస్తున్నారు. ఇవి సెట్స్ మీద ఉండగానే వెంకీ కుడుమల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించేశారు చిరు.
ఈ సినిమాతోపాటు నాటి నాయిక రాధికకు నిర్మాణ సంస్థలో సినిమా చేస్తానని కూడా చెప్పారు. అయితే దీనికి దర్శకుడి ఇంకా తేలలేదు. ఈ రెండూ కాకుండా మారుతి సినిమాలో నటిస్తానని చెప్పారు చిరు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని మారుతి చెప్పారు. ఇది కాకుండా త్రివిక్రమ్ డైరక్షన్‌లో సినిమా ఉంటుందని వార్తలొస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా సాగితే.. ఇప్పటిలాగే పై సినిమాల్లో ఓ మూడింటిని ఒకేసారి పట్టాలెక్కించి వరుసగా పూర్తి చేయాలని చూస్తున్నారట చిరంజీవి.
మరి ఆయా సినిమాలు ఎప్పుడు ఫైనల్ అవుతాయి, కథలు ఎప్పుడు లాక్ అవుతాయి అనేది చూడాలి. కథ లాక్ అవ్వకుండా, బౌండ్ స్క్రిప్ట్ లేకుండా చిరంజీవి సినిమాలు మొదలుపెట్టరు. అలా చేస్తే ఆ సినిమా మీద డౌటే అంటారు. ఈ విషయం మొన్నీ మధ్యే చిరు చెప్పారు కూడా. సో మూడు తర్వాత మరో మూడు అన్నమాట కాన్సెప్ట్.