మెగాస్టార్ చిరంజీవి – కేఎస్ రవీంద్ర (బాబీ) కాంబినేషన్‌లో ఓ సినిమా పనులు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు కీలక సమాచారం బయటకు వచ్చింది. ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టే సమయం ఆసన్నమైందట. ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్న చిరంజీవి ఆ వచ్చే నెల కొత్త సినిమా స్టార్ట్ చేసేస్తారట.
‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లనున్న బాబీ సినిమాను ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో మొదలు పెడతారని సమాచారం. మార్చి నుండి సెట్స్‌లోకి చిరంజీవి అడుగు పెడతారని తెలుస్తోంది. పూర్తిగా యాక్షన్ ప్రాధాన్యమున్న కథతో సిద్ధం చేయనున్న ఈ సినిమాలో మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో చిరు కనిపిస్తారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ఆయనతోపాటు మరో స్టార్ కూడా ఉంటారని సమాచారం వస్తోంది. అయితే అది అతిథి పాత్రనా ఎక్స్‌టెండెండ్ అతిథి పాత్రనా అనేది తెలియాలి.

‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత చిరు – బాబీ మరోసారి కలసి సినిమా చేస్తున్నారు. అందులో ఓ ముఖ్యపాత్రకు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను అడిగారట. నిజానికి ఈ పాత్రకు తొలుత ఓ తమిళ యువ హీరోను సంప్రదించారని టాక్. అయితే పాత్ర ప్రకారం ఆ పాత్ర వయసు ఎక్కువగా ఉండటంతో ఆలోచన మార్చుకున్నారని సమాచారం. అందుకే మోహన్‌లాల్ అయితే కరెక్ట్‌గా ఉంటుందని అనుకుంటున్నారట. ఇలాంటి పాత్రలు లాలెటన్ చేస్తుంటారు కాబట్టి చిరు సినిమాను కూడా ఓకే చేయొచ్చు అని అంటున్నారు.
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసి అఫీషియల్‌గా చెప్పారు. ఆ పోస్టర్‌లో చిన్న హింట్ కనిపించింది. దాని ప్రకారం చూస్తే బెంగాల్ నేపథ్యంలో చిరంజీవి – బాబీ కొత్త సినిమా కథ ఉండబోతుంది. సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌లోని గొడ్డలి మీద ‘বংশে আসছে’ అని రాసి ఉంది. అది బంగ్లా భాష. ‘వంశంలోకి వస్తున్నాడు’ అని దాని అర్థం. అంటే సినిమాలో హీరో తన కుటుంబానికి దూరంగా ఉంటాడు. కీలకమైన సమయంలో తిరిగి తన వారి దగ్గరకు వస్తాడు. వచ్చాక ఏమైంది, ఆ ముందు ఏమైంది అనేది అనేదే సినిమా మెయిన్ లైన్ అని చెప్పొచ్చు.
