కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు చియాన్ విక్రమ్. తెలుగులో కూడా ఆయనకు మంచి మార్కెట్ ఉంది. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నారు. మొదటి నుంచి విక్రమ్ రూటే సెపరేటు. ‘శివపుత్రుడు’ నుంచి మొదలుపెడితే ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేశారాయన. ఇప్పుడు ‘కోబ్రా’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు విక్రమ్. ఈ క్రమంలో అయన కొంతమంది స్టూడెంట్స్ ను కలిశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇదే సమయంలో ఓ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఎమోషనల్ గా బదులిచ్చారు. ఇంతకీ ఆ స్టూడెంట్ అడిగిన ప్రశ్న ఏంటంటే..? ‘చిన్న చిన్న సమస్యలకు స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు’ అని విక్రమ్ ని ప్రశ్నించారు. దానికి విక్రమ్..
ఏమైందో తెలియదు కానీ ఈ జెనరేషన్ అలా అయిందని అనుకుంటున్నానని చెప్పారు. స్టూడెంట్స్ బాగా చదువుకోవాలి.. డిగ్రీలు సాధించాలి.. ఇది కాదనలేని విషయమని.. అయితే దాన్ని ఒత్తిడిగా తీసుకోవద్దని చెప్పారు. విద్యార్థులకు చదువే కాకుండా చాలా విషయాలపై ఆసక్తి ఉంటుందని.. దానిపై మరింత ఫోకస్ చేయాలని చెప్పారు. కానీ ఇప్పుడు అలా లేదని.. ఒత్తిడిని జయించలేకపోతున్నారని అన్నారు.
మానసికంగా బలంగా ఉండాలని సూచించారు. ఒకప్పుడు తనను చూసి నడవలేవని చెప్పారని.. కానీ ఇప్పుడు ఏకంగా నటిస్తున్నానని.. ఏదైనా సాధిస్తానని అనుకోవాలని.. కలలు నెరవేర్చుకోవాలని చెప్పారు.