తెలుగు చిత్ర పరిశ్రమలో వివిధ రాష్ట్రాలకు చెందిన నటీమణులు అడుగుపెట్టి హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలాగే తెలుగు సినిమాల్లోతన సత్త చాటుకోవాలని ఆశపడుతున్న యువ నటీమణుల్లో దర్శన బానిక్ ఒకరు. బెంగాలీలో ఆరు సినిమాలు చేసి, మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ భామ ఆటగాళ్లు సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది. ఆంధ్రుడు, పెదబాబు చిత్రాల దర్శకుడు పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో దర్శన బానిక్.. నారా రోహిత్, జగపతిబాబులతో పోటీపడి నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. ఈ సందర్భంగా దర్శన బానిక్ మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది.
తెలుగు చిత్ర సీమపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘‘తెలుగులో అవకాశం రాగానే మొదట కొంచెం భయపడ్డాను. భాష తెలియదు.. కథని, పాత్రని బాగా అర్ధం చేసుకొని భావాలను పలికించగలనా? అని కంగారు పడ్డాను. కానీ దర్శకుడు పరుచూరి మురళి గారు చాలా ప్రశాంతంగా సీన్ అర్థమయ్యేలా వివరించి చెప్పడంతో నా పని సులువుగా మారింది. యూనిట్ సభ్యులంతా బాగా ఆదరించారు. ఎప్పుడూ కొత్త వాతావరణంలో ఉన్నాననే ఆలోచనే రాకుండా రోజులు గడిచిపోయాయి’’ అని తెలిపింది. అభినయం ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేయాలనీ ఉందని మనసులోని కోరికని బయటపెట్టింది.