నాని నిర్మాతగా మారి రూపొందిస్తున్న చిత్రం ‘అ!’. ప్రశాంత్ వర్మ అనే యువకుడ్ని దర్శకుడిగా పరిచయమవుతూ కాజల్, నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్, ఈషా రెబ్బ, రెజీనా వంటి వారందరూ ముఖ్యపాత్రలో నటింపజేస్తున్న ఈ చిత్రానికి నాని, రవితేజలు వాయిస్ ఓవర్ లు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక డిఫరెంట్ సబ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కానీ ట్రైలర్ కానీ సినిమాలోని కంటెంట్ ఏమిటనే విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. విడుదలైన పోస్టర్స్ మొదలుకొని ఆడియో వరకూ ప్రతిదీ ఆసక్తి మాత్రం రేకెత్తించింది. నిన్న విడుదలైన “అ!” థీమ్ సాంగ్ మాత్రం పాత్రల స్వభావాన్ని పరిచయం చేసింది. ఈ లిరికల్ వీడియోని కాస్త ఆసక్తిగా చూస్తూ సాహిత్యాన్ని అర్ధం చేసుకోగలిగితే గనుక సినిమాలో ఏ పాత్ర స్వభావం ఏమిటనే విషయం చాలా ఈజీగా అర్ధమవుతుంది.
“విశ్వమే దాగినా నాలోనా.. ఎప్పుడూ ఒంటరే నేనేనా,
చూపులే గుచ్చినా అడగనైనా లేనా.. చేతులే వేసినా ఆపనైనా లేనా,
కాలమే చేసినా మాననీ గాయం.. యంత్రమే చూపదా నా గమ్యం,
అందనే అందదే ఒక్క అవకాశం.. అందితే చేరనా నేను ఆకాశం,
అందరూ తప్పని చూపినా వేలే.. ఊహాకే అందని ప్రేమ నాదేలే,
ఎంతగా ఎగిరినా తాకుతోంది నేలే.. మత్తులో మరవనా మనుగుతున్నా తేలే,
నా చిన్ని గుండెలో ఏదో వేదనా మొదలయ్యేనా.. నా అన్నీ ఆశలే గాయం మాటున మిగిలేనా, మనసిలా అద్దమై ముక్కలయ్యేనా.. ఒక్కరే వందలా చుట్టూ మూగేనా,
కరగనూ కలవనూ ద్వేషమే వదలను, గతమునే విడువను మరణమే మరువనూ, శత్రువై దేహమే మనసుతో కలబడే, చీకటే వీడనీ బ్రతుకుకే సెలవనే కదిలెనే, నేటితో బాధలే తీరేనా, నాదనే లోకమే చేరానా..”
“విశ్వమే దాగినా నాలోనా.. ఎప్పుడూ ఒంటరే నేనేనా”ఈ చరణం కాజల్ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తుంది. మనిషిలో విశ్వమంత ఆలోచనలు ఉన్నప్పటికీ ఒంటరిగానే ఫీల్ అవుతున్నాడని.
“చూపులే గుచ్చినా అడగనైనా లేనా, చేతులే వేసినా ఆపనైనా లేనా”
ఈ లైన్ ఈషా రెబ్బ పాత్ర స్వభావాన్ని వర్ణిస్తుంది. ఈమె ఒక సాధారణ యువతి అని, తన ఆలోచనల్ని ఎవరో ఆపడానికి ప్రయత్నించినా ఏమీ చేయలేని నిస్సహాయురాలు అని.
కాలమే చేసినా మాననీ గాయం, యంత్రమే చూపదా నా గమ్యం”అవసరాల శ్రీనివాస్ ఒక వాచ్ మెకానిక్ అని క్యారెక్టర్ ఇంట్రోలోనే చెప్పేశారు. సో అతడి పాత్ర గతంలో జరిగిన ఏదో గాయాన్ని/తప్పునీ సరిదిద్దడం కోసం యంత్రంతో కుస్తీ పడుతుంటాడు అని అర్ధమవుతుంది.
“అందనే అందదే ఒక్క అవకాశం, అందితే చేరనా నేను ఆకాశం”
ప్రియదర్శి ఒక చెఫ్. అన్నీ వంటలూ వచ్చు అని నమ్మించి ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ.. తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ఎదురుచూస్తుంటాడు. అవకాశం లభించాలే కానీ తాను అందనంత ఎత్తుకు ఎదగలను అన్న అతడి నమ్మకం తెలుస్తుంది.
“అందరూ తప్పని చూపినా వేలే.. ఊహాకే అందని ప్రేమ నాదేలే”
సొసైటీ తనను మోడ్రన్ ఉమెన్ అని తప్పుగా చూస్తున్నా.. తన వేషధారణను వేలెత్తి చూపుతున్నా.. వారెవ్వరూ ఊహించలేనంత ఔన్నత్యం కలిగిన పాత్ర నిత్యామీనన్ ది.
“ఎంతగా ఎగిరినా తాకుతోంది నేలే.. మత్తులో మరవనా మనుగుతున్నా తేలే”
గతంలో చేసిన తప్పులను మర్చిపోయి.. కొత్త జీవితం మొదలెడదామని ప్రయత్నించే యువతి రెజీనా. అయితే.. ఆమె గత జీవిత స్మృతులు మాత్రం ఆమెను వెంబడిస్తాయి, ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా ఆమె డ్రగ్స్ తీసుకొనేదని దాని ప్రభావం నుంచి బయటపడడానికి ఇబ్బందిపడుతోందని ఈ చరణం భావం.
“నా చిన్ని గుండెలో ఏదో వేదనా మొదలయ్యేనా.. నా అన్నీ ఆశలే గాయం మాటున మిగిలేనా, మనసిలా అద్దమై ముక్కలయ్యేనా.. ఒక్కరే వందలా చుట్టూ మూగేనా”
ఇది అందరి మనసులో మెదిలే ఆవేదన. ఆ ఆవేదనకి కారణం ఆశలు. ఆ ఆశాలన్నీ మనసు లోతుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని బయల్పరాచాలంటే అప్పటికే అయిన గాయాలు వాటిని ఆపుతున్నాయి. మనసు అద్దంలా ముక్కలైనప్పుడు.. ఆ మనసులోని ఒకే ఒక్క సమస్య ఆ పగిలిన పెంకుల్లో వందలుగా కనిపిస్తుంది.
“కరగనూ.. కలవనూ.. ద్వేషమే వదలను, గతమునే విడువను.. మరణమే మరువనూ, శత్రువై దేహమే మనసుతో కలబడే, చీకటే వీడనీ బ్రతుకుకే సెలవనే కదిలెనే, నేటితో బాధలే తీరేనా, నాదనే లోకమే చేరానా”
సరిగ్గా అర్ధం చేసుకోవాలే కానీ సినిమాలోని కథాంశమే కాదు జీవిత సత్యం దాగి ఉంది ఈ లైన్ లో. “బాధ కరగదు, మనిషి కలవడు, ద్వేషాన్ని వదలడు, గతాన్ని విడువడు, మరణాన్ని గుర్తు చేసుకుంటూ.. మనసులో బ్రతకాలనే ఆశతో మనిషిగా పోరాడుతూ.. చీకటి నుంచి వెలుగులోకి రాలేక.. బాధలని తప్పించుకొనేందుకు దేహాన్ని విడిచిపోయి, ఆనందం అనే లోకం కోసం ఆరాటపడే” మనిషి తత్వాన్ని ఈ ఒక్క లైన్ లో చెప్పాడు సాహిత్యాన్ని సమకూర్చిన కృష్ణకాంత్.
ఇదంతా పాట విని, లిరికల్ వీడియో చూసి మాకు అనిపించినది మాత్రమే. కథకి, పాటకి మేము వివరించిన విధానానికి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే 🙂
సో ఫిబ్రవరి 16న విడుదలవుతున్న “అ!” సినిమా చూసి ఇదంతా నిజమా కాదా అనే విషయం తెలుసుకొందాం.