ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన దేవదాస్ కనకాల(74) ఈరోజు మృతి చెందారు. కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నారు. అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈయన కొడుకు రాజీవ్ కనకాల సినిమాల్లో రాణిస్తుండగా కోడలు సుమ కూడా స్టార్ యాంకర్ గా రాణిస్తుంది. 1945 సంవత్సరం యానాం శివారులోని కనకాల పేటలో ఈయన జన్మించారు. పలు టీవీ సీరియల్స్ తో పాటు అనేక సినిమాల్లో కూడా నటించారు.
ముఖ్యంగా ‘అమృతం’ సీరియల్ తో ఈయన మరింత పాపులర్ అయ్యారు. అందులో అమృతం మామగారుగా… అనేక సార్లు నష్టపోతున్న పరిస్థితుల్లో తనదైన నటనతో నవ్వులు పూయించారు. ఇక దర్శకుడిగా కూడా ‘చలి చీమలు’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ నాడులో ఫిలిం ఇండస్ట్రీ ఉన్నప్పుడు… ఎంతోమంది ప్రముఖులకు నటనలో శిక్షణ ఇచ్చారు దేవదాస్ కనకాల. రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి స్టార్ హీరోలు ఈయన శిష్యులే కావడం విశేషం. అంతేకాదు.. హైదరాబాద్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏర్పడిన తరువాత ‘ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’ ను పెట్టి ఇక్కడ కూడా ఎంతోమందికి నటనలో శిక్షణ ఇచ్చారు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. దేవదాస్ కనకాల మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎంతో మంది సెలెబ్రిటీలు.. ‘ఈయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటని’ కన్నీళ్ళు పెట్టుకుంటూ.. ‘ఈయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.