ఘట్టమనేని కుటుంబం నుంచి వచ్చిన మరో యువ కథానాయకుడు అశోక్ గల్లా (Ashok Galla) . మేనమామ మహేష్ బాబు (Mahesh Babu) ఆశీస్సులతో, ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథతో, అర్జున్ జంధ్యాల (Arun Jandyala) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దేవకీ నందన వాసుదేవ” (Devaki Nandana Vasudeva). మైథాలజీ టచ్ ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా గతవారమే విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ.. థియేటర్ల కొరత కారణంగా ఈవారం (నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రెండో సినిమాతోనైనా అశోక్ గల్లా నటుడిగా నిలదొక్కుకోగలిగాడా? సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!!
Devaki Nandana Vasudeva Review
కథ: కంసరాజు (దేవదత్తా) దేవుడ్ని నమ్మిన దుర్మార్గుడు. కాశీలో ఓ అఘోరా తన చెల్లెలికి పుట్టబోయే మూడో సంతానం కారణంగా మరణం సంభవిస్తుంది అని చెప్పాడని, కడుపుతో ఉన్న చెల్లెలి (దేవయాని) భర్తను దారుణంగా చంపి, ఆ తర్వాత ఓ పోలీస్ ను చంపిన హత్య కేసులో 21 ఏళ్ల పాటు జైలుకు వెళతాడు.
కట్ చేస్తే.. కృష్ణ (అశోక్ గల్లా) తల్లితో కలిసి గోదావరి జిల్లాలో చీరలు నేస్తూ చుట్టూ ఉన్నవారికి సహాయపడుతూ ఉంటాడు. కంసరాజు మేనకోడలు సత్య (మానస వారణాసి)ని ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అసలు కంసరాజు చెల్లెలికి మూడో సంతానం కలిగిందా? ఒకవేళ కలిగితే ఆ మూడో సంతానం ఎవరు? కృష్ణ పనిగట్టుకుని కంసరాజు దగ్గర ఎందుకు చేరతాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “దేవకీ నందన వాసుదేవ” చిత్రం.
నటీనటుల పనితీరు: సినిమా మొత్తంలో నటిగా ఆకట్టుకుంది ఝాన్సీ మాత్రమే. తల్లి పాత్రలో ఆమె మాత్రమే సహజమైన నటనతో అలరించింది. చిన్నపాటి ఫైట్ సీన్ కూడా చేసిందనుకోండి. ఆమె తర్వాత కాస్త అలరించిన నటి దేవయాని. బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఎంత దూరమైనా వెళ్తుంది అనే ధైర్యం ఆమె కళ్ళల్లో కనిపించింది. దేవదత్త నటించడానికి కష్టపడ్డాడు. కళ్లల్లో రౌద్రంతోపాటు ముఖంలో భావం కనిపించాలి అనే విషయాన్ని ఆయన కానీ దర్శకుడు కానీ పెద్దగా పట్టించుకోలేదు. అందువల్ల స్లో మోషన్ షాట్స్ లో ఆయన ఊగే బుగ్గలు తప్ప ఏమీ ఎలివేట్ అవ్వలేదు.
ఇక మెయిన్ క్యాస్ట్ అయిన అశోక్ గల్లా, మానస వారణాసి గంతకు తగ్గ బొంత అన్న రీతిలో నటించిన విధానం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అశోక్ గల్లా వయసుకు తగ్గ పాత్ర కాదు ఇది. కుర్రాడు సరదా పాత్రలు చేయాలి. ఈ సినిమా చూసాక అతడి మొదటి సినిమా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఏ రేంజ్ లో మ్యానేజ్ చేశాడో అర్థమవుతుంది. ఒక్కటంటే ఒక్క సన్నివేశంలోనూ నటించలేక తాను ఇబ్బందిపడి, ప్రేక్షకుల్ని ఇబ్బందిపెట్టాడు అశోక్.
ఇక మానస వారణాసి ముఖంలో హావభావాలు ఇక్కడున్నాయా అని బూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి. తెలుగమ్మాయి, చూడచక్కగా ఉన్న అమ్మాయి, అందులోనూ ప్రపంచ సుందరి.. అలాంటి అమ్మాయి హీరోయిన్ గా రాణించడానికి మోడల్ ఫేస్ ఉంటే సరిపోదు నటన కూడా రావాలి అని గ్రహించకపోవడం బాధాకరం. అమ్మడు అర్జెంట్ గా యాక్టింగ్ క్లాసులకు వెళ్ళాలి. శత్రు కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ, ప్రేక్షకులే ఆ హాస్యాన్ని ఆస్వాదించలేకపోయారు.
సాంకేతికవర్గం పనితీరు: 2018లో తరుణ్ ఓ కన్నడ మూవీ రీమేక్ గా నటించిన “ఇది నా లవ్ స్టోరీ” అనే సినిమాలో ప్రాసలతో కూడిన డైలాగులు వినలేక జనాలు థియేటర్ల నుండి బయటికి పరుగులు పెట్టిన సందర్భాన్ని మరోసారి సీనియర్ మోస్ట్ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా గుర్తు చేశారు. ఆయన ప్రాసల కోసం రాసిన డైలాగులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఉపయోగపడతాయి కానీ, ఎలివేషన్ కి కాదు. ఉదాహరణకి ఒకటి చెప్పాలి.. ఝాన్సీ ఫైట్ చేస్తూ “కొడితే అమ్మా అని అరిచే కొడకల్లారా.. అమ్మ కొడితే ఎలా ఉంటుందో చూపిస్తా” అని చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో న భూతో న భవిష్యత్. రచయితగా ఆయన ప్రాసలను పక్కన పెట్టి అర్ధవంతమైన సంభాషణలు రాస్తేనే ఆయన సీనియారిటీకి ఒక వేల్యు.
ఇక ఈ సినిమాకి “కథ” అందించి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ప్రశాంత్ వర్మ పనితనం గురించి మాట్లాడుకోవాలి. 2017లో విడుదలైన “వాట్ హాపెన్డ్ టు మండే” అనే హాలీవుడ్ సినిమా కాన్సెప్ట్ లో కృష్ణ-కంస అనే మైథలాజికల్ అంశాన్ని ఇరికించి “దేవకీ నందన వాసుదేవ” అనే కథను చిత్రబృందానికి అంటగట్టిన విధానం అతడి కెరీర్ కి మాయని మచ్చగా నిలుస్తుంది. సినిమాటోగ్రాఫర్లు రసూల్ ఎల్లోర్ & ప్రసాద్ మూరెళ్ల మరియు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాత్రమే ఈ సినిమా బడ్జెట్ కి న్యాయం చేసిన టెక్నీషియన్లు. అయితే.. వారి పనితనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
ఇక దర్శకుడు అర్జున్ జంధ్యాల తన గురువు బోయపాటి తరహాలోనే యాక్షన్ సీన్స్ వరకు బాగానే తీస్తున్నాడు కానీ, ఎమోషన్ ఎలా పండించాలి అనే విషయాన్ని నేర్చుకోలేకపోయాడు. కథ ఇతడిది కాదు కాబట్టి పూర్తిగా అర్జున్ ని బాధ్యుడ్ని చేయలేం కానీ.. దర్శకుడిగా అతడి మార్క్ యాక్షన్ సీన్స్ లో తప్ప ఎక్కడా కనిపించలేదు. ప్రొడ్యూసర్స్ డబ్బులు ఖర్చు పెట్టడంలో ఎక్కడా వెనుకాడలేదు. అయితే.. ఆ డబ్బు వెనక్కి తిరిగి వస్తుందా అంటే డౌటే.
విశ్లేషణ: మూలకథలో లేదా కథనంలో మైథాలజీ ఇమిడి ఉండాలి కానీ.. కేవలం ఆడియన్స్ ను ఫూల్స్ చేయడం కోసం ఇరికించకూడదు. క్లైమాక్స్ లో దశావతారాలకు సంబంధించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ తో క్రియేట్ చేసిన సీజీ షాట్స్ ఎందుకు వస్తాయో, అసలు కంసుడు, కృష్ణుడు, సత్యభామ కాన్సెప్ట్ ను కలగాపులగం ఎందుకు చేశారో అనేది ఎంత ఆలోచించినా అర్థం కాని విషయాలు. అశోక్ గల్లా ఇప్పటికైనా తన వయసుకు తగ్గ కథలు ఎంచుకోవాలి, మానస వారణాసి అందంతోపాటు అభినయ సామర్థ్యం పెంచుకోవాలి, ప్రశాంత్ వర్మ దగ్గరున్న 33 కథలను మళ్లీ ఒకసారి చదువుకొని రీవర్క్ చేయాలి, నిర్మాత బాలకృష్ణ తదుపరి సినిమా విషయంలోనైనా కథను కాస్త అర్థం చేసుకొని ముందడుగు వేయాలి.