యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునే రోజులవి. అనుకున్నట్లుగా ఆ పరిశ్రమలో చాలా వరకు అలాంటి సినిమాలే తెరకెక్కించేవారు. అవి విజయాలు కూడా అందుకునేవి కూడా. అలాంటి వాటిలో ‘ధూమ్’ (Dhoom) ఒకటి. మూడు సినిమాలుగా వచ్చిన ఈ సినిమాల సిరీస్‌కు అదిరిపోయే స్పందన వచ్చింది. అయితే ఏమైందో ఏమో సినిమా టీమ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. నాలుగో ‘ధూమ్’ ఎప్పుడు అనే మాట వినిపించడం లేదు. ఇక సినిమా టీమ్ చెప్పేలా లేదు అని ఫ్యాన్స్ అనుకున్నారో ఏమో..
‘ధూమ్ 4’ అంటూ ఓ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ‘ధూమ్ 4’ (Dhoom 4) వస్తుందా? వస్తే హీరోలు ఎవరు? హీరోయిన్ ఎవరు? అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) , ఉదయ్ చోప్రా (Aditya Chopra) ఉంటారా? అంటూ రకరకాల చర్చలు మొదలయ్యాయి. ‘ధూమ్ 3’ సినిమా వచ్చి పదేళ్లు దాటిపోయింది. దీంతో ఈ ఫ్రాంచైజీలో నాలుగో సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘ధూమ్ 4’ సినిమా త్వరలో పట్టాలెక్కనుందని, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కానీ, హృతిక్ రోషన్ కానీ (Hrithik Roshan) , రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కానీ విలన్‌గా నటిస్తారు అని ఓ అంచనాకు అభిమానులే వచ్చేశారు.
అంతేకాదు సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని కూడా రాసుకొచ్చారు. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని బాలీవుడ్ సీనియర్ విశ్లేషకుడు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ‘ధూమ్ 4’ సినిమాను చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నా, ఆ సినిమా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇంకా ఎలాంటి పనులు మొదలుపెట్టలేదు. ఒకవేళ సినిమా మొదలు పెడితే యశ్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగానే ప్రకటిస్తుంది అని ఆయన చెప్పారు. అప్పటివరకూ ఈ ప్రచారం ఆపేయమని కూడా ఆయన కోరారు. దీంతో హుషారు మీదున్న అభిమానులు నిస్సారంగా అయిపోయారు.
‘ధూమ్’ ఫ్రాంఛైజీలో తొలి సినిమా 2004లో వచ్చింది. జాన్ అబ్రహాం (John Abraham)విలన్‌గా నటించగా.. అభిషేక్ బచ్చన్, ఇషా డియోల్ (Esha Deol) , రిమీ సేన్ ఇతర ముఖ్యపాత్రధారులు. 2006లో ‘ధూమ్ 2’ (Dhoom-2) వచ్చింది. ఈసారి సినిమా నటీనటుల ఫేమ్ పెరిగింది. హృతిక్ రోషన్ విలన్ కాగా, ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) , బిపాస బసు (Bipasha Basu), అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలు చేశారు. ఆమిర్ ఖాన్ (Aamir Khan) ద్విపాత్రాభినయం చేస్తూ ‘ధూమ్3’ (Dhoom 3) చేశాడు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2013లో వచ్చి బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్ల వసూళ్లు సాధించింది.